Begin typing your search above and press return to search.

‘పాన్’ మీద నగల వ్యాపారుల గుస్సా ఏల?

By:  Tupaki Desk   |   10 Feb 2016 5:22 AM GMT
‘పాన్’ మీద నగల వ్యాపారుల గుస్సా ఏల?
X
నల్లధనానికి చెక్ చెప్పేందుకు చర్యలు తీసుకోవాలన్న వాదన ఒకపక్క వినిపిస్తుంటే.. ఆ దిశగా ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనువెంటనే నిరసనలు. . ఆందోళనలు వ్యక్తం కావటం ఈ దేశంలోనే చెల్లుతుందేమో. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ‘‘పాన్’’ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా ఉన్న నగల వ్యాపారులు నిరసనగా తమ షాపుల్ని ఈ రోజు బంద్ చేశారు. ఇంతకీ పాన్ రూల్ ఏమిటంటే.. ఏదైనా నగల షాపులో రూ.2లక్షలకు పైన కొనుగోళ్లు జరిపితే.. వాటికి ‘పాన్ కార్డు’ తప్పనిసరి అన్న రూల్ పెట్టేందుకు డిసైడ్ చేసింది.

దీంతో.. నగల వ్యాపారులకు కోపం వచ్చేసింది. పాన్ కార్డు తప్పనిసరి అంటే.. లక్షలాది రూపాయిల బంగారం కొనే వాళ్ల లెక్క ఇట్టే తెలిసిపోతుంది. దీంతో.. తమ గుట్టు బయటపడే వీలుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయితే.. తమ నిరసనకు ఓ అందమైన వాదనను సిద్ధం చేశారు నగల వ్యాపారులు. వారు చెప్పేదేమంటే.. దేశంలోని రైతుల్లో చాలామందికి పాన్ కార్డులు ఉండవని.. అలాంటప్పుడు రూ.2లక్షలకు పైగా బంగారం కొన్నప్పుడు గ్రామీణులు పాన్ కార్డులు చూపించటానికి వారి దగ్గర అలాంటివి ఉండవని.. అలాంటప్పుడు సమస్యలు తలెత్తుతాయి కదా అని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు.. సాదాసీదా పెళ్లిళ్లకే పావుకిలో బంగారం (దీని విలువ సుమారు రూ.7.5లక్షలు) ఉంటుందని వారు వాదిస్తున్నారు. దేశంలో జరిగే ప్రతి పెళ్లికి పావు కిలో బంగారం కొనే పరిస్థితే ఉంటే.. దేశం పేద దేశం ఎందుకు అవుతుందన్నది ఒక ప్రశ్న? మరో ప్రశ్న ఏమిటంటే.. ఒకవేళ అలాంటి ఇబ్బందే ఏర్పడితే.. కొనాల్సిన రూ.7.5లక్షల బంగారాన్ని నాలుగు దఫాలుగా కొనుక్కునే సౌలభ్యం ఉంది కదా? ఒకేసారి రూ.2లక్షలకు కొన్నప్పుడే పాన్ కార్డు కానీ ప్రతి రోజూ రూ.1.5లక్షల చొప్పున లేదంటే రూ.1.95లక్షల బంగారం కొనుగోలు చేసినా పాన్ కార్డు అవసరం లేదుకదా?

అలాంటప్పుడు గ్రామీణులు నాలుగైదు దఫాలుగా కొనుగోలు చేసే అవకాశం ఉంది కదా. ఇదేమీ కందిపప్పు.. ఉప్పు కాదు కదా రోజూ అవసరం ఉండటానికి. అలాంటప్పుడు రూ.2లక్షలు పెట్టి ఒకేసారి బంగారం కొనే సత్తా ఉన్నప్పుడు.. ‘పాన్’ ఏర్పాటు చేస్తే పోయేదేముంది? బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు సైతం వ్యాపారులు సిద్ధంగా ఉన్నట్లు లేరే? నిజానికి బంగారు షాపుల్లో జరిగే ప్రతి కార్యకలాపాల్ని డెబిట్ లేదంటే క్రెడిట్ కార్డులతోనే వ్యవహారాలు నడపాలని.. నగదుతో అస్సలు లావాదేవీలు జరపకూడదన్న రూల్ పెట్టాలే కానీ చాలానే ‘‘లెక్కలు’’ బయటకు వచ్చే వీలుంది. రూ.2లక్షలకుపైన కొనుగోలు చేసే వారికి పాన్ కార్డు చూపించాలన్న దానికే ఇంత రచ్చ చేస్తున్న వ్యాపారులు.. ప్లాస్టిక్ మనీతోనే లావీదేవీలు జరపాలంటే మరెంత ఆందోళన చేస్తారో..?