Begin typing your search above and press return to search.

ఇన్నాళ్ల‌కు వారిద్ద‌రూ మ‌ళ్లీ క‌నిపించారు

By:  Tupaki Desk   |   16 Dec 2017 5:12 AM GMT
ఇన్నాళ్ల‌కు వారిద్ద‌రూ మ‌ళ్లీ క‌నిపించారు
X
గుజ‌రాత్ మొత్తాన్ని అట్టుడికిపోయేలా చేసి.. యావ‌త్ దేశం షాక్ తినేలా చేసిన వైనం గోద్రా ఉదంతం. 2002లో జ‌రిగిన అల్ల‌ర్ల వేళ‌.. అహ్మ‌దాబాద్‌ కు చెందిన రెండు మ‌తాల‌కు చెందిన ఇద్ద‌రు ఫోటోలు జాతీయ స్థాయిలోనే కాదు.. అంత‌ర్జాతీయ స్థాయిలోనూ ఫేమ‌స్ అయ్యాయి. గుజ‌రాత్ అల్ల‌ర్ల తీవ్ర‌త మొత్తాన్ని రెండు ఫోటోల్లోనే చెప్పేసేవారు. ఇప్ప‌టికి అదే ప‌రిస్థితి.

అలా అంద‌రికి సుప‌రిచిత‌మైన రెండు ఫోట్లో మొద‌టిది.. అల్ల‌ర్ల నేప‌థ్యంలో చేతులు జోడిస్తూ.. దీనంగా రోదించే ఒక వ్య‌క్తి ప్రాణ ర‌క్ష‌ణ కోసం ఎంత‌గా త‌పిస్తున్నార‌న్న‌ట్లుగా ఉంటే.. మ‌రో ఫోటోలో క‌త్తి ప‌ట్టుకొని ఆవేశంగా తిరుగుతున్న మ‌రో వ్య‌క్తి ఫోటో అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆలోచించేలా చేశాయి.

దాదాపు 15 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న అల్ల‌ర్ల‌కు సంబంధించిన ఈ రెండు ఫోటోల్లోని వారు ఇప్పుడేం చేస్తున్నారు? వారు ఎక్క‌డ ఉన్నారు? అన్న‌ది చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఊహించ‌ని రీతిలో వారిద్ద‌రు ఇప్పుడు స్నేహితులుగా కూడా ఉన్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఫోటోలో ద‌య‌నీయ‌మైన స్థితిలో చేతులు జోడించిన వ్య‌క్తి పేరు కుతుబుద్దీన్‌. గుజ‌రాత్ అల్ల‌ర్ల త‌ర్వాత బెంగాల్‌ కు వ‌ల‌స వెళ్లిన అత‌గాడు.. అక్క‌డ ఉండ‌లేక తిరిగి గుజ‌రాత్‌ కు వ‌చ్చేశాడు. ఇదిలా ఉంటే.. ఫోటోలో వీరావేశంతో క‌త్తి ప‌ట్టుకొని హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ట్లుగా ఉన్న మ‌రో వ్య‌క్తి పేరు అశోక్‌. తాజాగా జ‌రిగిన గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. వీరిద్ద‌రూ అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో ఓటు వేసేందుకు వెళ్లారు.

నాడు భ‌యంతో వ‌ణికి.. చేతులు జోడించిన కుతుబుద్దీన్.. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం తానుఓటు వేసిన‌ట్లుగా చెప్పాడు. ఇక‌.. నాడు క‌త్తి ప‌ట్టుకొని వీరావేశంతో ఉన్న అశోక్ మాత్రం ఓటు వేయ‌లేకపోయాడు. ఓట‌రు జాబితాలో త‌మ పేరు లేక‌పోవ‌టం అత‌గాడు పోలింగ్ స్టేష‌న్ నుంచి నిరాశ‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా వారిద్ద‌రూ స్నేహంగా మాట్లాడుకోవ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. వారి మాట‌ల్లో గుజ‌రాత్ ఇప్పుడు చాలా మారింద‌న్న మాట ఒకేలా రావ‌టం గ‌మ‌నార్హం.