Begin typing your search above and press return to search.

గోదావరి బోటు ప్రమాదానికి నెల..ఇంకా దొరకని ఆచూకీ

By:  Tupaki Desk   |   15 Oct 2019 8:24 AM GMT
గోదావరి బోటు ప్రమాదానికి నెల..ఇంకా దొరకని ఆచూకీ
X
గోదావరి నదిలో బోటు మునిగి దాదాపు 50 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి నేటికి నెల రోజులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా దేవీప‌ట్నం మండ‌లం కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళ్తోన్న రాయల్ వశిష్ట బోటు బోల్తా పడింది. ఆ సమయంలో పాపికొండలు విహారయాత్రకు వెళుతున్న 77 మంది ప్రమాదానికి గురయ్యారు. అయితే వీరిలో 26 మంది ప్రాణాలని చుట్టుపక్కల ఉన్న జాలర్లు తమ ప్రాణాలకు తెగించి కాపాడారు. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతదేహాలని ప్రభుత్వం బయటకు తీసింది.

కానీ ఇప్పటికీ మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. ఇక గల్లంతు అయిన వారి ఆచూకీ దొరక్కపోవడంతో, వారి కుటుంబ సభ్యులు ఆశలు వదిలేసుకున్నారు. కొన్ని శవాలు మునిగిపోయిన బోటులోనే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే బోటు ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో...అప్పటి నుంచి అనేకసార్లు దానిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు - ప్రభుత్వం - ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సంప్రదాయ పద్దతిలో మరోసారి బోటు వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది.

ఇక గతంలో మాదిరిగానే సత్యం బృందం బోటు పైకి తీయడానికి ఇప్పుడు కూడా ఇనుప తాడును వృత్తాకారంలో నదిలో వేసి.. వాటి కొసలను ఒడ్డున ఉన్న పొక్లెయిన్‌తో లాగడం ద్వారా గాలింపు చేపడతారు. ఒకవేళ ఏదైనా తగిలినట్టు అనిపిస్తే.. లంగరు వేసి దాన్ని ఒడ్డుకు లాగుతారు. ఇందుకోసం దాదాపు 1000 మీటర్ల తాడును ఉపయోగిస్తోంది. అయితే గత నెల 23వ తేదీ వరకూ ధర్మాడి సత్యం బృందం బోటు వెలికితీతకు ప్రయత్నించి చేతులెత్తేసింది.

ఆ తర్వాత 30న మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈనెల మూడో తేదీ వరకూ కొనసాగించింది. కానీ నదిలో వరద ఉధృతి కారణంగా గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురవడంతో మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం వరద పోటు తగ్గడంతో కలెక్టర్‌ అనుమతితో ధర్మాడి సత్యం బృందం మళ్లీ పనులు మొదలు పెట్టనుంది. ఈ సారైనా బోటు బయటపడుతుందేమో చూడాలి.