Begin typing your search above and press return to search.

పడవ ప్రమాదం: ఒక్కరోజే తేలిన 13మృతదేహాలు

By:  Tupaki Desk   |   17 Sep 2019 8:30 AM GMT
పడవ ప్రమాదం: ఒక్కరోజే తేలిన 13మృతదేహాలు
X
అనుకున్నట్టే జరుగుతోంది. గోదారిలో మునిగిన పడవ ప్రమాదంలో మృతిచెందిన వారి శవాలు నది నీటిలో పైకి తేలుతున్నాయి. గోదావరిలో పడవ ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతోంది. మొత్తం 65 మందికి పైగా ఉన్న బోటు తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన మూడో రోజున గోదావరి తీరం వెంట ఒక్కటొక్కటిగా మృతదేహాలు పైకి తేలుతుండడంతో విషాదం అలుముకుంది. గల్లంతైన వారికోసం అన్వేషిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీసులు, సిబ్బంది, గజ ఈతగాళ్లు ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

మంగళవారం ఉదయం 13 మృతదేహాలు గోదావరి నదీ తీరం వెంట పైకి తేలి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. దీంతో ఇప్పటిదాకా స్వాధీనం చేసుకున్న మృతదేహాల సంఖ్య 18కి చేరింది. కచ్చలూరు వద్దే మూడు మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి. మూడింట్లో ఒకటి బాలుడిది కావడం విషాదం నింపింది. ఇక ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం మహానందీశ్వర స్వామి ఆలయం, మంటూరు సమీపంలో రెండు చొప్పున మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాల జేబు, ప్యాంట్లలో గుర్తింపు కార్డుల ఆధారంగా వారిని గుర్తిస్తున్నారు. నరసాపురానికి చెందిన బీఎస్ ఫణికుమార్ మృతదేహాన్ని ఇలానే గుర్తించారు.

కాగా గోదావరిలో ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దీంతో కచ్చలూరులో మునిగిన పడవలోంచి నదీ ప్రవాహంలో మృతదేహాలు కొట్టుకుపోయినట్టు అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ధవళేశ్వరం వరకూ గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ధవళేశ్వరం వద్ద దిగువన నైలాన్ తాడ్లు కట్టి మృతదేహాలు కొట్టుకుపోకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ఇక మునిగిన పడవలో కూడా కొన్ని మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యం కాగా ఇంకా 24మంది జాడ తెలియాల్సి ఉంది. మూడు రోజులు అవుతున్న క్రమంలో శవాలు నదిలో పైకి తేలియాడుతూ ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. మృతదేహాలను రంపచోడవరం, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అక్కడ మృతుల బంధువులు పడికాపులు కాస్తున్నారు. తమ వారి చివరి చూపుల కోసం రోదనలు మిన్నంటాయి.

మునిగిన పడవలోనే మిగతా మృతదేహాలు ఉండవచ్చని.. వరద తగ్గితేనే దాన్ని పైకి తీసుకురావడం సాధ్యమని అధికారులు భావిస్తున్నారు. గజ ఈతగాళ్లకు కూడా అడుగున ఉన్న పడవ దగ్గరకు వెళ్లి రావడం సాధ్యం కావడం లేదట.. వరద ప్రవాహం భారీగా ఉన్న నేపథ్యంలో కొట్టుకువచ్చిన మృతదేహాలను సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్నారు.మృతదేహాలు తేలడం.. వాటిని గుర్తించడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి..