Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీకి సవాల్ గా గోవా కాంగ్రెస్ నేతలు

By:  Tupaki Desk   |   17 March 2017 11:18 AM GMT
రాహుల్ గాంధీకి సవాల్ గా గోవా కాంగ్రెస్ నేతలు
X
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ లో మినహా ఎక్కడా అధికారం పొందలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. అది నెహ్రూ-గాంధీ కుటుంబ రాజకీయాలపై ధిక్కార స్వరం వినిపిస్తుండడం.. అది కూడా చిన్న రాష్ర్టమైన గోవా నుంచి మొదలు కావడం.. దీంతో ఇది ముందుముందు మరింత పెరిగి పెను సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. గోవాలో ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ అధికారంలోకి రాలేకపోవడం.. తమ కంటే తక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీ వెంటవెంటనే పావులు కదిపి మద్దతు సమీకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడి నేతలు షాకయ్యారు. తమ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రభావవంతంగా వ్యవహరించలేకపోవడం.. జాతీయ నాయకులు కూడా సమర్థంగా వ్యూహాలు రచించలేకపోవడంతోనే ప్రభుత్వం ఏర్పరచడంలో విఫలమయ్యామని అంటున్నారు. రాహుల్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే బహిరంగంగానే రాహుల్ ను విమర్శిస్తుండడంతో అక్కడి వ్యవహారాలు చూస్తున్న దిగ్విజయ్ సింగ్ షాక్ తింటున్నారు. జాతీయ స్థాయి నేతలే రాహుల్ - సోనియాలను ఏమీ అనలేని పరిస్థితుల్లో గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం నిర్భయంగా - బహిరంగంగా విమర్శిస్తుండడం చూసి లబోదిబోమంటున్నారట.

మరోవైపు ఇక కాంగ్రెస్ లో ఉండి లాభం లేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే తన ఎమ్మెల్యే పదవికి - కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇవ్వగా... తాజాగా మరో ఎమ్మెల్యే సావియో రోడ్రిగ్వెస్ ఇదే పనిచేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీని తమ నేతగా అంగీకరించలేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ బాధ్యత తీసుకోకపోవడంతో దిగ్విజయ్ సింగ్ ఈ ఓటమికి బాధ్యత వహించాల్సి ఉంటుందని రోడ్రిగ్వెస్ అనడం సంచలనంగా మారింది.

మొన్నటి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులు - చిన్న పార్టీలకు 11 స్థానాలు రాగా - బీజేపీకి 12 - కాంగ్రెస్ కు 17 వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో దిగ్విజయ్ సింగ్ అక్కడకి వెళ్లి తిష్ఠ వేసినా కూడా ఏమీ చేయలేకపోయారు. రాహుల్ గాంధీ అయితే గోవాపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ నేతలు సీఎం ఎవరు కావాలన్న విషయంలోనే కొట్లాటలకు దిగగా అంతలో బీజేపీ మొత్తం సర్దేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/