Begin typing your search above and press return to search.

ఇంద్రేషా.. అన్సారీని వెళ్లిపొమ్మంటారా?

By:  Tupaki Desk   |   13 Aug 2017 10:38 AM GMT
ఇంద్రేషా.. అన్సారీని వెళ్లిపొమ్మంటారా?
X
ఉప‌రాష్ట్రప‌తిగా బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు బాధ్య‌త‌లు స్వీక‌రించే దాకా అప్ప‌టిదాకా ఆ స్థానంలో ఉన్న హ‌మీద్ అన్సారీ గానీ - ఆయ‌న‌పై ఇటు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆరెస్సెస్‌) నేత‌లు గానీ ఎలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌లేదు. అస‌లు అంత‌టి కీల‌క స్థానంలో ఉన్న వ్య‌క్తులు వివాదాస్ప‌ద అంశాల జోలికి వెళ్లిన దాఖ‌లాలే లేవ‌ని చెప్పాలి. ఇక ఆ స్థానాల నుంచి దిగిపోయిన నేత‌లు కూడా ఆ త‌ర్వాత వివాదాల్లో చిక్కుకున్న దాఖ‌లా లేద‌నే చెప్పాలి. ఆది నుంచి కొన‌సాగుతూ వ‌స్తున్న ఈ స‌త్సంప్ర‌దాయానికి విరుద్ధంగా మొన్న భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విమ‌ర‌ణ చేస్తున్న స‌మ‌యంలో హ‌మీద్ అన్సారీ కొంత‌మేర వివాదం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. అయితే దానికి అక్క‌డిక‌క్క‌డే ఫుల్ స్టాప్ ప‌డిపోయింది.

ఉప‌రాష్ట్రప‌తిగా విధులు నిర్వ‌ర్తించిన వ్య‌క్తి ఏదో చిన్న మాట అంటే దానిని ప‌ట్టుకుని వేలాడ‌టం ఎందుకులే అనుకున్నారో, ఏమో తెలియ‌దు గానీ.... ఈ వివాదం అంత‌టితోనే ముగిసిపోయింది. అయితే నాడు హ‌మీద్ అన్సారీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆరెస్సెస్ మాత్రం మ‌రిచిపోన‌ట్లు ఉంది. ఎందుకంటే... హిందూత్వ వాదాన్ని న‌ర‌న‌రాన జీర్ణించుకుని ఉన్న ఆరెస్సెస్‌... ఇప్పుడు కొత్త‌గా హ‌మీద్ అన్సారీని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్య‌లే చేసింది. భార‌త్‌ లో మైనారిటీల‌కు అంత‌గా భ‌ద్ర‌త లేద‌ని భావిస్తే... త‌మ‌రు దేశాన్ని వీడిపోయినా త‌మ‌కేమీ ఇబ్బంది లేద‌న్న కోణంలో ఆరెస్సెస్ కీల‌క నేత ఇంద్రేష్‌ కుమార్ వ్యాఖ్యానించారు. భార‌త్ లో కాకుండా ప్ర‌పంచంలో ఇంకెక్క‌డైనా పూర్తి స్వేచ్ఛ - భద్రత ఉందని భావిస్తారో ఆ దేశానికి వెళ్లవచ్చని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అన్సారీ సహా ముస్లింలు భారత్‌ లో అభద్రతా భావంతో ఉన్నారని భావిస్తున్నవారంతా ముస్లింలు సురక్షితంగా ఉన్న దేశం పేరు వెల్లడించి, నిరభ్యంతరంగా అక్కడికి వెళ్లవచ్చని కుమార్‌ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని, ముస్లింలు సైతం ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించారని చెప్పారు. పదేళ్లుగా లౌకిక వాదిగా ఉన్న హమీద్‌ అన్సారీ పదవీ విరమణ చేయగానే కుహనా లౌకికవాదిగా మారారని ఇంద్రేష్‌ విస్మయం వ్యక్తం చేశారు.