Begin typing your search above and press return to search.

వ‌న్నాక్రై తాత లాంటి వైర‌స్ సృష్టించేశారు

By:  Tupaki Desk   |   19 May 2017 4:37 AM GMT
వ‌న్నాక్రై తాత లాంటి వైర‌స్ సృష్టించేశారు
X
వన్నాక్రై ...వంద‌కు పైగా దేశాల్లో త‌న ప్ర‌తాపాన్ని చాటి అంతర్జాతీయంగా భయోత్పాతం సృష్టించిన ర్యాన్సమ్‌ వేర్‌. ఎన్నో దేశాలు అత‌లాకుత‌లం అయిపోయి ఆ ప్రభావం నుండి ఇంకా బయటకు రాకముందే మరో సైబర్‌ దాడి జరిగిందని సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. అడిల్‌ కుజ్‌ గా పిలిచే వైరస్‌ చాప కింద నీరులా చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా కంప్యూటర్లలోకి చొరబడుతుందనే తేల్చేశారు.

ప్రాథ‌మిక గణాంకాలను పరిశీలించినట్లైతే వన్నా క్రై దాడికన్నా పెద్ద స్థాయిలో ఈ దాడి ఉంటుందని భావిస్తున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ప్రూఫ్‌ పాయింట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వందలు - వేల సంఖ్యలో కంప్యూటర్లను - సర్వర్లను ఇది ప్రభావితం చేస్తోందని తెలిపారు. వన్నా క్రై దాడికి గురైన కంప్యూటర్లలోని ఫైళ్ళన్నీ ఎన్‌ క్రిప్ట్‌ అయిపోతాయి. హ్యాకర్లకు డబ్బు చెల్లిస్తేనే అవి మామూలు రూపంలోకి వస్తాయి. కానీ ఈ అడిల్‌ కుజ్‌ వైరస్‌ మాత్రం వినియోగదారులకు తెలియకుండానే వారి కంప్యూటర్లలోకి చొరబడి, వారి డేటాను ఉపయోగించుకుంటూ వివిధ కంపెనీల లాజికల్‌ సమస్యలను పరిష్కరిస్తుంది. తద్వారా వారు చెల్లించే కరెన్సీని బిట్‌ కాయిన్‌ ల రూపంలో హ్యాకర్ల ఖాతాలకు బదిలీ చేస్తుంది.

అడిల్‌ కుజ్‌ వైరస్‌ సోకిన కంప్యూటర్‌ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలదు. నెమ్మదిగా కంప్యూటర్‌ లేదా సర్వర్‌ పనితీరును మందగింపచేస్తుందని నిపుణులు తెలిపారు. వన్నా క్రై స్తంభింప చేసినట్లుగా అడిల్‌ కుజ్‌ వినియోగదారులను తమ కంప్యూటర్ల నుండి, డేటా నుండి వెంటనే వేరుచేయదు. ఈ దాడి కూడా బహుశా ఏప్రిల్‌ 24 సమయంలోనే జరిగివుండవచ్చునని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. తమ పరిశోధనలో భాగంగా పరిశోధకులు మూడు హాకర్ల అడ్రస్సులను గుర్తించారు. వాటిని మూసివేయడానికి ముందుగానే 7వేలు - 14వేలు - 22వేలు డాలర్లను సంపాదించినట్లు గుర్తించారు. అయితే తమ ఆధారాలు తెలియకుండా వుండడం కోసం ఈ సైబర్‌ దాడి వెనుక ఉన్నవారు తరచుగా క్రమం తప్పకుండా ఆన్‌ లైన్‌ చెల్లింపుల అడ్రసులను మారుస్తూ ఉన్నార‌ని వారు వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/