Begin typing your search above and press return to search.

ఆ ఏడాది మ‌హా వినాశ‌నం గ్యారెంటీ అట‌

By:  Tupaki Desk   |   22 Sep 2017 4:25 AM GMT
ఆ ఏడాది మ‌హా వినాశ‌నం గ్యారెంటీ అట‌
X
అనంత విశ్వంలో భూమి ఓ బుజ్జి గ్ర‌హం మాత్ర‌మే. కోట్లాది ఏళ్ల నుంచి మ‌నిషి అనేక ప‌రిణామ‌క్ర‌మాల‌కు లోనై ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఉన్నాడు. మ‌నిషి నిర్ల‌క్ష్యంతో చేజేతులారా తన‌కు బ‌తికే అవ‌కాశం ఇస్తున్న పుడ‌మికి మ‌హా వినాశ‌నం తీసుకొచ్చేలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ప్ర‌తి సంద‌ర్భంలోనే వినాశ‌నం గ్యారెంటీ అంటూ వార్త‌లు వ‌స్తుంటాయి. అయితే.. ఈ సారి మాత్రం ప‌క్కా అంటూ అమెరికాకు చెందిన శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్న మాట‌లు ద‌డ పుట్టించ‌టం ఖాయం.

మ‌హా అయితే మ‌రో 80-85 ఏళ్లు అని.. 2100 నాటికి మ‌హా వినాశ‌నం గ్యారెంటీ అని.. భూమి మీద బ‌త‌క‌టం క‌ష్ట‌మ‌ని తేల్చి చెబుతున్నారు మ‌సాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీకి చెందిన లారెన్జ్ సెంట‌ర్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా చెబుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ భూమి మీద ఐదు మ‌హా వినాశ‌నాలు చోటు చేసుకున్నాయ‌ని.. ఆరోది.. మ‌నిషి నిర్ల‌క్ష్యం ఫ‌లితంగా చోటు చేసుకోనుంది అంటున్నారు.

ఈ శ‌తాబ్దం చివ‌రి నాటికి స‌ముద్రాల్లో బోలెడంత కార్బ‌న్ డ‌యాక్సైడ్ చేరిపోవ‌టం ఖాయ‌మంటున్నారు. అప్పుడు భూమి మీద మ‌రో మ‌హావినాశ‌నం మొద‌ల‌వుతుంద‌ని.. దీని దెబ్బ‌కు భూమి మీద బ‌త‌క‌టం భారమ‌ని వారు చెబుతున్నారు. గ‌డిచిన 54 కోట్ల ఏళ్ల‌ల్లో ఐదు మ‌హా వినాశ‌నాలు జ‌రిగాయ‌ని.. ఇందులో జ‌రిగిన వాటిల్లో ఒక మ‌హా వినాశ‌నం కార‌ణంగా రాకాసి బ‌ల్లులు అంత‌మొందాయ‌ని చెబుతున్నారు. వాతావ‌ర‌ణంలో కార్బ‌న్ డ‌యాక్సైడ్ పెరిగిపోవ‌టం.. స‌ముద్రాల్లో బోలెడంత కార్బ‌న్ డ‌యాక్సైడ్ వాయువుతో నిండిపోవ‌టంతో మ‌హా వినాశ‌నం మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. అతి త‌క్కువ వ్య‌వ‌ధిలోనే స‌ముద్రాల్లోకి కార్బ‌న్ డ‌యాక్సైడ్ చేరిపోతుంద‌ని చెబుతున్న శాస్త్ర‌వేత్త‌లు.

నిజానికి మ‌నిషి జీవితం ఇప్ప‌టికే దుర్భ‌రం అయ్యింది. రుతువులు స‌రిగా లేవు. అతి వృష్టి - అనావృష్టి - వేడి వాతావ‌ర‌ణం ఇబ్బంది పెడుతున్నా జ‌నం ఏ మాత్రం ఆలోచించండం లేదు. శాస్త్ర‌వేత్త‌ల మాట‌-జ‌నం న‌డ‌వ‌డిక రెండూ సింక్ చేసుకుంటే ఈ ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం క‌చ్చితంగా ఉంద‌నిపిస్తుంది.