Begin typing your search above and press return to search.

చెత్తకుండీలో బంగారు పతకం!

By:  Tupaki Desk   |   30 Aug 2016 5:11 AM GMT
చెత్తకుండీలో బంగారు పతకం!
X
ఒలింపిక్స్ లో సాధించి ప‌త‌కం క‌నిపించ‌కుండా పోతే ఎలా ఉంటుంది..? క‌ష్ట‌ప‌డి సాధించిన బంగారు ప‌త‌కం ఎవ‌రో దొంగ‌లించేస్తే ఆ క్రీడాకారుడి ఆవేద‌న ఏవిధంగా ఉంటుంది..? 1992లో జ‌రిగిన బార్సిలోనా ఒలింపిక్స్ లో రోయింగ్ విభాగంలో స్వ‌ర్ణం సాధించాడు జో జాకొబి. తాను సాధించిన ఈ ప‌త‌కాన్ని భ‌ద్రంగా దాచుకుంటూ వ‌చ్చారు. అయితే, గ‌త నెల జూన్ నుంచి ఈ ప‌త‌కం క‌నిపించ‌కుండా పోయింది. దాంతో కంగారుప‌డ్డాడు జాకొబి. త‌రువాత, పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌న కారులో ఉండాల్సిన ఒలింపిక్ మెడ‌ల్ ని ఎవ‌రో చోరీ చేశారంటూ పోలీసుల‌కు చెప్పాడు. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. అతడి ఆవేద‌న‌ను అర్థం చేసుకున్న అభిమానులు కూడా ఈ పోస్టింగ్ షేరింగ్ చేశారు. ఇది జ‌రిగి రెండు నెల‌లు అయింది. అయితే... ఇప్పుడు అనూహ్యంగా ఆ ప‌త‌కం జాకొబికి చేరింది!

అట్లాంటాకు చెందిన ఏడేళ్ల చిన్నారి కోల్ స్మిత్ కి ఈ బంగారు ప‌త‌కం దొరికింది. ఒక చెత్త‌కుండీలో ఆ చిన్నారికి ఇది క‌నిపించింది. తండ్రికి చూపిస్తే... ఇది జాకొబీ మెడ‌ల్ అని నిర్దారించాడు. ఆ విష‌యాన్ని జాకొబికి తెలిసేలా చేశాడు. త‌న ప‌త‌కం మ‌ళ్లీ దొరికింద‌ని తెలియ‌గానే జాకొబి ఆనందానికి హ‌ద్దుల్లేవు. వెంట‌నే ఆ చిన్నారి చ‌దువుతున్న పాఠ‌శాల‌కు వెళ్లాడు. ఆమెని అభినందించాడు. ఒక గొప్ప అథ్లెట్ త‌మ పాఠ‌శాల‌కు రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని ఉపాధ్యాయులు ఆనందం వ్య‌క్తం చేశారు.

నిజ‌మే క‌దా.. ఎక్క‌డో రోడ్డు మీద చెత్త‌కుండీలో దొరికిన బంగారు ప‌త‌కాన్ని ఎవ‌రిదో క‌నుక్కుని మ‌రీ ఆ విజేత‌కు అప్ప‌గించారంటే, మెచ్చుకోవాల్సిందే. అందుకే, చిన్నారిని ఎంతో మెచ్చుకున్నాడు జాకొబీ. తిరిగి వ‌చ్చాన్ని ప‌త‌కాన్ని ప‌ట్టుకుని, ఇంకోప‌క్క చిన్నారిని పెట్టుకుని ఫొటోలు దిగాడు. ఈ చిన్నారికి త‌న జీవితంలో ఎప్పుడూ మ‌ర‌చిపోలేన‌ని జాకొబీ అన్నారు.