పాండ్యాకు షాకిచ్చిన జిల్లెట్

Sat Jan 12 2019 16:47:02 GMT+0530 (IST)

ఓ టీవీ కార్యక్రమంలో మహిళలపై నోరుజారి టీమిండియా నుంచి సస్పెండ్ అయిన హార్ధిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. కాఫీ విత్ కరణ్ షో పాల్గొని మహిళలపై హార్ధిక్ చేసిన వ్యాఖ్యలు అతడి కెరీర్ కు పెద్ద మచ్చలా పరిణమించాయి. ఇప్పటికే బీసీసీఐ అతడిపై సస్పెన్షన్ విధించగా.. తాజాగా హార్ధిక్ అంబాసిడర్ గా ఉన్న ఓ కంపెనీ అతడికి షాక్ ఇచ్చింది. అతడిని అంబాసిడర్ గా తీసివేస్తూ నిర్ణయం తీసుకుంది.జిల్లెట్ షేవింగ్ సంస్థ పాండ్యాను తమ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. జిల్లెట్ తాజా నిర్ణయంతో పాండ్యాతో టై అప్ యిన గల్ఫ్ ఆయిల్ సిన్ డెనిమ్ డీఎఫ్ ఒప్పో స్పోర్ట్ వంటి సంస్థలు కూడా పాండ్యాను తప్పించాలా లేదా అన్న ఆలోచనలో పడిపోయాయి. అన్ని బ్రాండ్లు పాండ్యా విషయంలో అలాంటి నిర్ణయం తీసుకుంటే పాండ్యా ఆర్థికంగా కుదేలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా సాగుతున్న ‘కాఫీ విత్ కరణ్’ షో ఎంతో పాపులర్.ఈ షోకు తాజాగా భారత క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా కేఎల్ రాహుల్ లు వెళ్లారు. కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత జీవితాలను ఆచితూచి చెప్పగా.. పాండ్యా మాత్రం రెచ్చిపోయాడు. తాను ఎంత మందితో శృంగారం చేసిందని.. మహిళలను పబ్బుల్లో * పార్టీల్లో ఎలా చేసింది చెప్పుకొచ్చాడు. అమ్మాయిలను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు.  మహిళల పట్ల వీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో బీసీసీఐ వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ కారణంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీరిద్దరూ భారత్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇద్దరిపై విచారణ చేస్తామని.. భారత్ కు తిరిగి వచ్చాక విచారణ పూర్తయ్యే వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇలా క్రికెట్ పరంగా.. అటు ప్రకటనలు స్పాన్సర్ పోయి హార్ధికపాండ్యా భవిష్యత్ గందరగోళంలో పడిపోయింది. ఒక్క టీవీ షో పాండ్యా తలరాతను తలకిందులు చేసింది. అందులో నోరుజారి పాండ్యా సర్వం పోగొట్టుకున్నట్టైంది.