Begin typing your search above and press return to search.

ఇంతకీ ఆమె టీడీపీలో చేరుతున్నట్లా లేదా?

By:  Tupaki Desk   |   23 Nov 2017 11:30 PM GMT
ఇంతకీ ఆమె టీడీపీలో చేరుతున్నట్లా లేదా?
X
విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీని వీడనున్నారని.. ఈ నెల 26 లేదా 27వ తేదీన టీడీపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆమె మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అరకు ఇన్‌చార్జ్‌గా కుంభా రవిబాబును నియమించడం.. మరో మాజీ మంత్రి ఒకరు వైసీపీలోకి రావడం దాదాపు కన్ఫర్మ్ కావడంతో ఆమె అలక వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గిడ్డి ఈశ్వరి కార్యకర్తలతో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని వైసీపీలో చేర్చుకోవడమే కాకుండా వారికి పదవులు ఇవ్వడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాగా కుంభా రవిబాబు విషయంలో గిడ్డి ఈశ్వరి పలుమార్లు అధిష్ఠానంతో ఆమె మాట్లాడినా ఆమె మాటను పట్టించుకోలేదని.. అందుకే పార్టీని వీడనున్నారని కార్యకర్తల్లో ప్రచారం జరుగుతోంది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె తన వర్గీయులతో పార్టీ కమిటీలు వేసి, రానున్న ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు గట్టి పునాదులు వేసుకుంటున్నారు. ఇంతలో మాజీ మంత్రి ఒకరు వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారని... ఆయన వైసీపీలో చేరితే అరకులోయ ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధంగా వుండాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పార్టీ సూచించినట్టు సమాచారం. అయితే ఇందుకు ఆమె నిరాకరించారని, అయినప్పటికీ అధిష్ఠానం మాత్రం ఎంపీగానే పోటీ చేయాలని ఆదేశిస్తుందని పార్టీ వర్గాల సమాచారం.

అయినా.. ఈశ్వరి అభ్యంతరాలను పట్టించుకోకుండా పార్టీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో పాడేరు టిక్కెట్‌ ఇస్తారని తెలుసుకున్న ఈశ్వరి, విజయసాయిరెడ్డితో మాట్లాడగా అరకు ఎంపీ స్థానంపై ఫోకస్ చేయాలని ఆమెకు మరోసారి సూచించారని తెలుస్తోంది. దీంతో ఆమె అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే... ఈశ్వరి మాత్రం ఈ ప్రచారాలను ఖండిస్తున్నారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు. అంతేకాదు... ఏం చూసి టీడీపీలోకి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆమె విమర్శలు చేశారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి తో తమకెలాంటి అభిప్రాయభేదాలు లేవని, వచ్చే ఎన్నికల్లో తమ అధినేత ఏ నిర్ణయం తీసుకున్న దానికి నేను శిరసా వహిస్తానని ఈశ్వరి అంటున్నారు.