Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ - జానాల‌కు ఆజాద్ షాక్!

By:  Tupaki Desk   |   5 Dec 2018 6:13 AM GMT
ఉత్త‌మ్ - జానాల‌కు ఆజాద్ షాక్!
X
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలంగాణ‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఆజాద్ మాట‌ల మ‌ర్మం ఏమై ఉండొచ్చ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. టీపీసీసీ నేత‌లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి - జానా రెడ్డిల‌కు ఆయ‌న వ్యాఖ్య‌లు శ‌రాఘాత‌మేన‌ని చెప్పుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి తో కొడంగ‌ల్‌లో మంగ‌ళ‌వారం ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. హైకోర్టు జోక్యంతో పోలీసులు ఎట్ట‌కేల‌కు రేవంత్‌ను విడిచిపెట్టారు. అనంత‌రం గులాం న‌బీ ఆజాద్ రేవంత్ ఇంటికెళ్లి ఆయ‌న్ను ప‌రామ‌ర్శించారు. చాలాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఆ త‌ర్వాత విలేక‌ర్ల‌తో మాట్లాడారు. అర్ధ‌రాత్రి బెడ్ రూముల్లో కి వెళ్లి అరెస్టులు చేసే సంస్కృతి కేసీఆర్ పాల‌న‌లో త‌ప్ప ఇంకెక్క‌డా లేదంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి శాశ్వ‌తం కాద‌ని ఆజాద్ పేర్కొన్నారు. ఈ రోజు కేసీఆర్ సీఎం గా ఉండొచ్చ‌ని.. రేపు రేవంత్ రెడ్డి ఆ పీఠాన్ని ఎక్క‌వ‌చ్చున‌ని వ్యాఖ్యానించారు. రేవంత్ లేనప్పుడు కేసీఆర్ కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో స‌భ పెట్ట‌డాన్ని ఆజాద్ ఎద్దేవా చేశారు. పులి ని బంధించి అడ‌విలో కి రావ‌డం గొప్ప కాద‌న్నారు. పులి ఉండ‌గానే అడ‌విలో కి రావాలంటూ స‌వాల్ విసిరారు.

మిగ‌తా మాట‌ల సంగ‌తెలా ఉన్నా.. రేపు రేవంత్ రెడ్డి సీఎం కావొచ్చంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌జా కూట‌మి గెలిస్తే కాంగ్రెస్ నేతే సీఎం అవుతార‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణ‌లో ఆ ప‌ద‌వికి పోటీ లో ఉన్న‌వారి లో రేవంత్ ఒక‌ర‌న్న‌ది కూడా అంద‌రికీ తెలిసిందే. అయితే - ఇత‌ర సీనియ‌ర్ నేత‌ల‌ను కాద‌ని కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్‌నే సీఎం చెయ్యాల‌ని భావిస్తోంద‌ని.. అందుకే ఆజాద్ వెంట ఆ మాట వచ్చింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

సోనియా, రాహుల్‌ల‌ తో ఆజాద్ నిరంత‌రం ట‌చ్‌ లో ఉండే సంగ‌తిని వారు గుర్తుచేస్తున్నారు. అలాంటి సీనియ‌ర్ నుంచి వ‌చ్చిన మాట‌ల‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడ‌ద‌ని అంటున్నారు. ఆయ‌న మాట‌లు ఉత్త‌మ్‌, జానా రెడ్డిల‌ కు షాకిచ్చేవేన‌ని అన్నారు. మ‌రి ఆజాద్ మాట‌ల‌ పై ఆ ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు ఎలా స్పందిస్తార‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.