Begin typing your search above and press return to search.

ప‌బ్ లో 'దెయ్యాల' పార్టీ...వైర‌ల్ వీడియో!

By:  Tupaki Desk   |   22 Oct 2017 9:21 AM GMT
ప‌బ్ లో దెయ్యాల పార్టీ...వైర‌ల్ వీడియో!
X
కొంత‌మంది దెయ్యాలు - భూతాలు - ఆత్మ‌లు - అతీత శ‌క్తులు ఉన్నాయ‌ని న‌మ్ముతారు. అవి మ‌న మ‌ధ్యే సంచ‌రిస్తుంటాయ‌ని, సంద‌ర్భాన్ని బ‌ట్టి కొంద‌రు మ‌నుషుల‌కు కూడా కనిపిస్తుంటాయ‌ని చెబుతుంటారు. మ‌రి కొంద‌రు ఇదంతా ఒట్టి ట్రాష్ అని - శాస్త్ర సాంకేతిక‌రంగం రాజ్య‌మేలుతున్న ఈ రోజుల్లో కూడా దెయ్యాలు - భూతాలున్నాయ‌ని న‌మ్మ‌డం మూర్ఖ‌త్వ‌మ‌ని కొంద‌రు కొట్టిపారేస్టుంటారు. ఈ విష‌యంపై ఎప్పుడూ భిన్న‌వాద‌న‌లు వినిపిస్తూనే ఉంటాయి. అయితే, కొన్ని ప్ర‌దేశాల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లు.... దెయ్యాలు - ఆత్మ‌లు - అతీత శ‌క్తులు ఉన్నాయ‌నే వారి వాద‌న‌కు బ‌లం చేకూరుస్తుంటాయి. వారి వాద‌న‌ను పూర్తి స్థాయిలో ఖండించ‌లేని విధంగా కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర స‌న్నివేశాల వీడియోలు రికార్డయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి వింత స‌న్నివేశాలు ఇంగ్లండ్ లోని ఓ ప‌బ్ లో క‌నిపించాయి. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఇంగ్లండ్ లోని కాంటెర్బరీ నగరంలో టేలర్స్‌ క్లిన్‌ పబ్ బాగా పాపుల‌ర్. అక్క‌డ‌ ప్ర‌తిరోజు ప‌బ్ మూసివేసే ముందు కుర్చీలు - బ‌ల్ల‌లు స‌ర్ద‌డం - కిటికీలు వేయడం - లైట్లు - ఫ్యాన్లు ఆపివేయ‌డం అక్క‌డి సిబ్బందికి నిత్యకృత్యం. అయితే, మ‌రుసటి రోజు ఉద‌యానికి య‌జ‌మాని అలిస్ట‌ర్ వ‌చ్చే సరికి ప‌బ్ అంతా చింద‌ర‌వంద‌ర‌గా ఉండేది. లైట్లు - ఫ్యాన్లు ఆన్ చేసి ఉండేవి. ఇదంతా సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్లే జరుగుతోంద‌ని అలిస్ట‌ర్ భావించేవాడు. ప్ర‌తిరోజు సిబ్బందిని చివాట్లు పెట్టేవాడు. తాము అన్నీ స‌ర్ది వెళ్తున్నామ‌ని సిబ్బంది వివ‌ర‌ణ ఇచ్చేవారు. దీంతో, ఆ మిస్ట‌రీ ఏంటో తెలుసుకోవ‌డానికి అత‌డు అక్క‌డి సీసీటీవీ ఫుటేజ్ ని తెప్పించాడు. ఆ ఫుటేజ్ చూసిన అలిస్ట‌ర్‌ - సిబ్బంది అంతా షాక్ అయ్యారు. ప‌బ్ మూసిన త‌ర్వాత అక్క‌డి కుర్చీలు - బ‌ల్ల‌లు క‌ద‌ల‌డాన్ని వారు గ‌మ‌నించారు. దీంతో, త‌మ ప‌బ్ లో కంటికి క‌నిపించ‌ని అతీత శ‌క్తులేవో వ‌చ్చి ఈ ర‌కంగా చేస్తున్నాయ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

ఫుటేజీ చూడ‌గానే ఆలిస్టర్‌ తో పాటు సిబ్బందికి కాళ్లు - చేతులు వణికిపోయాయి. పబ్ మూసేసిన త‌ర్వాత‌ పబ్ లోని కుర్చీలు వాటంతట అవే కదల‌డాన్ని వారు గ‌మ‌నించారు. ఎవ‌రో కిటికీలు తెరిచిన‌ట్లు.... లైట్లు - ఫ్యాన్లు ఆన్ చేసిన‌ట్లు క‌నిపించాయి. సోఫాలో కింద ఉన్న‌దిండు త‌ల కింద పెట్టుకున్న‌ట్లుగా పైకి లేచి ఉండ‌డాన్ని కూడా వారు గ‌మ‌నించారు. ద‌ర్జాగా ఎవ‌రో పార్టీ చేసుకొని మద్యం తాగుతున్నట్లుగా కనిపించే దృశ్యాలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ప‌బ్ లోని గార్డెన్ లో ఉన్న కుర్చీ దానంత‌ట అదే ముందుకు వెన‌కకు క‌ద‌ల‌డాన్ని వారు గ‌మ‌నించారు. అంతేకాకుండా, అప్ప‌టివ‌ర‌కు మూసి ఉన్న గొడుగు - ఎవ‌రో తెరిచిన‌ట్లుగా ఓపెన్ అయినట్లు ఫుటేజ్ లో క‌నిపించింది. అక్క‌డ ఉండే సెలూన్ త‌లుపులు ఎవ‌రో తెరిచిన‌ట్లు వాటంత‌ట అవే ఓపెన్ అయ్యాయి.

రాత్రి వేళల్లో తాము ప‌బ్ ను శుభ్రం చేస్తున్న‌పుడు కొన్ని సార్లు ఎవ‌రో మెట్లు ఎక్కుతున్న శ‌బ్దాలు వ‌చ్చేవ‌ని, తీరా వెళ్లి చూస్తే అక్క‌డ ఎవ‌రూ ఉండేవారు కాద‌ని అక్క‌డ ప‌నిచేసే వారు చెప్పారు. కొన్ని సార్లు ఏవో నీడ వంటి ఆకారాలు త‌లుపులు తీస్తున్న‌ట్లుగా క‌నిపించేవని వారు చెప్పారు. అయితే - ఆత్మలు - దెయ్యాలు ఈ ప‌ని చేశాయో లేదో తెలియద‌ని, కంటికి కనిపించని అతీత‌ శక్తులు త‌న‌ పబ్‌ లో ఉన్నాయని ఆలిస్టర్ అంటున్నారు. త‌న ప‌బ్ లో ఆగ‌స్టు 4 వ తారీకు నుంచి జ‌రిగిన వింత స‌న్నివేశాలు సీసీ టీవీ ఫుటేజ్ వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ స‌న్నివేశాలు త‌మ‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశాయ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. తాము ఆ ప‌బ్ లోకి వెళ్లే ధైర్యం చేయ‌మ‌ని కొంద‌రు కామెంట్ చేశారు.