Begin typing your search above and press return to search.

బాబుపై ఘ‌ట్ట‌మ‌నేని కూడా దండెత్తారండోయ్‌!

By:  Tupaki Desk   |   22 Nov 2017 1:34 PM GMT
బాబుపై ఘ‌ట్ట‌మ‌నేని కూడా దండెత్తారండోయ్‌!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై ఇప్పుడు న‌లుదిక్కుల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్టుగా ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే బాబు స‌ర్కారు అవలంబిస్తున్న విధానాల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ - ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి - ఆ పార్టీ నేత‌లు ఎక్క‌డిక‌క్క‌డ క‌డిగి పారేస్తున్నారు. వైరి వ‌ర్గం ఎలాగూ ఏం చేసినా విమ‌ర్శిస్తుందిలే అనుకోవ‌డానికి కూడా బాబుకు అవ‌కాశం లేకుండా చేసేలా... మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్న బీజేపీ నేత‌లు కూడా బాబు స‌ర్కారుపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ఇదే త‌రుణంలో మొన్న‌టికి మొన్న ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులు పెద్ద వివాదానికే దారి తీశాయి. ఉత్త‌మ చిత్రాలు - న‌టుల‌కివ్వాల్సిన నంది అవార్డుల‌ను సైకిల్ అవార్డులుగా మార్చేశార‌ని ఓ వ‌ర్గానికి చెందిన సినీ జ‌నం దెమ్మెత్తిపోసింది. ఈ వివాదం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో తెలియ‌క బాబుతో పాటు చిన‌బాబు లోకేశ్ కూడా త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేసి మ‌రింత వివాదం కొని తెచ్చుకున్నార‌న్న వాద‌న లేక‌పోలేదు.

ఇదంతా ఒక ఎత్తైతే... గుంటూరు ఎంపీగా ఉన్న టీడీపీ యువ నేత గ‌ల్లా జ‌య‌దేవ్ మామ గారైన సూప‌ర్ స్టార్ కృష్ణ గారి సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరి రావు కూడా ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. ఘ‌ట్ట‌మ‌నేని అంటే.. నంది అవార్డుల‌పై రేగిన వివాదాన్ని బేస్‌ గా తీసుకుని బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌లేదు గానీ.. వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్న ఆదిశేష‌గిరిరావు... ప్ర‌భుత్వ పాల‌న‌పై నిప్పులు చెరుగుతూ బాబు స‌ర్కారును నిజంగానే క‌డిగిపారేశార‌ని చెప్పాలి. కాసేపటి క్రితం విజ‌య‌వాడ‌లో మీడియా స‌మావేశం పెట్టిన ఆదిశేష‌గిరిరావు... బాబు స‌ర్కారుపై అంతెత్తున ధ్వ‌జ‌మెత్తారు. వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడి హోదాలో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన‌ ఆదిశేషగిరావు... చంద్రబాబు సర్కార్‌ అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌ లతో కాలం గడుపుతోందని మండిపడ్డారు.

కృష్ణా, గోదావరి డెల్టాలు పూర్తిగా ఎండిపోయాయని, వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి పనికి ప్రతిపక్షం అడ్డుపడుతుందంటూ నెపం నెడుతున్నారన్నారు. అంత‌టితో ఆగ‌ని ఆదిశేష‌గిరిరావు... టీడీపీ లేఖ ఇవ్వకపోతే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయేది కాదని కూడా పాత‌గాయాన్ని రేపారు. హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీని ఎందుకు ఉపయోగించుకోకూడదని, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బీజేపీ - టీడీపీ నేతలు సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటూ..ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. నోట్ల రద్దు - జీఎస్‌ టీ తన గొప్పేనని గతంలో చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు బీజేపీపై ఆ నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ డీజీపీ నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయ‌న ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు.