ఇక.. ఈ కార్లను భారత్ లో అమ్మరు

Thu May 18 2017 21:54:05 GMT+0530 (IST)

అమెరికా బహుళజాతి సంస్థ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రోజురోజుకీ విస్తృతమవుతున్న భారత్ మార్కెట్‌ను మరింతగా చేజిక్కించుకునేందుకు వీలుగా భారీ ప్రణాళికలు వేస్తున్న కంపెనీల సంగతి తెలిసిందే. దీనికి భిన్నంగా ప్రఖ్యాత జనరల్ మోటార్స్ సంస్థ మాత్రం అందుకు భిన్నంగా భారత్ లో తన కార్ల అమ్మకాల్ని నిలిపివేయాలని నిర్ణయించింది. తీవ్ర పోటీ ఉన్న మార్కెట్లలో ఒకటైన భారత్ లో ఈ కంపెనీ ప్యాసెంజర్ కార్ల అమ్మకాలు ఒక్క శాతంగానే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కార్ల అమ్మకాల్ని భారత్ లో నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.అయితే.. అమ్మకాలు ఆపేస్తారు కానీ.. కంపెనీకి ఉన్న టలేగావ్ ప్లాంట్ లో కార్ల ఉత్పత్తిని మాత్రం నిలిపివేయరు. ఈ ఫ్లాంటులో ఏటా 1.30లక్షల వాహనాల్ని తయారు చేసే సామర్థ్యం ఉంది. దీంతో పాటు బెంగళూరు టెక్ సెంటర్ ను కూడా కొనసాగిస్తారు. అదే సమయంలో గుజరాత్ లోని హాల్ లో ఫ్లాంట్ ను చైనా వెంచర్ భాగస్వామి సైక్ మోటార్ కార్ప్ కు విక్రయిస్తారు. భారత్ లోని తయారీ సౌకర్యాల్ని పూర్తిగా వినియోగించుకొని.. అంతర్జాతీయ అమ్మకాల్లో వృద్ధి సాధిస్తామని కంపెనీ చెబుతోంది. తాజాగా తాము తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ ఆపరేషన్స్ ను మరింత బలోపేతం చేసేందుకు ఒక కీలమైనదని జీఎం వైఎస్ ప్రెసిడెంట్.. జనరల్ మోటార్స్ ఇంటర్నేషనల్ అధినేత స్టీఫెన్ జుకోబి వెల్లడించారు. భారత్ లాంటి విస్తృత మార్కెట్ ను వదులుకోవటం జీఎంకు ఏ విదంగా లాభమవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/