Begin typing your search above and press return to search.

అవును.. ఆ ఇంజెక్ష‌న్ రూ.14 కోట్లు!

By:  Tupaki Desk   |   26 May 2019 5:14 AM GMT
అవును.. ఆ ఇంజెక్ష‌న్ రూ.14 కోట్లు!
X
ఏదైనా జ‌బ్బు చేసిన‌ప్పుడు మందుగోళీ వేసుకోవ‌టం.. అంత‌కూ కుద‌ర‌దంటే ఇంజెక్ష‌న్ చేయించుకోవ‌టం తెలిసిందే. జ‌బ్బును బ‌ట్టి.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు ఇంజెక్ష‌న్ల‌ను రాస్తుంటారు వైద్యులు. వీటి ఖ‌రీదు ఐదు రూపాయిల నుంచి ల‌క్ష వ‌ర‌కూ విని ఉన్నాం. కానీ.. ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఇంజెక్ష‌న్ రూటు స‌ప‌రేటు. దీని ధ‌ర వింటే నోట మాట రాదంతే. తాజాగా మార్కెట్లోకి విడుద‌లైన ఈ ఇంజెక్ష‌న్ ధ‌ర ఏకంగా రూ.14కోట్లు.

సామాన్య‌ల సంగ‌తి త‌ర్వాత‌.. సెల‌బ్రిటీలు సైతం ఒక‌టికి రెండుసార్లు ఆలోచించి మాత్ర‌మే వాడ‌గ‌లిగిన ఇంజెక్ష‌న్ గా దీన్ని చెప్పాలి. ఇంత‌కూ ఈ ఇంజెక్ష‌న్ ను ఎందుకు వాడ‌తారు? దానికి అంత ఖ‌రీదు ఎందుకు? ఇంత‌కీ ఈ ఇంజెక్ష‌న్ ను త‌యారు చేసినోళ్లు ఎవ‌రంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

ఈ ఇంజెక్ష‌న్ పేరు జోల్ జెన్ స్మా. స్విట్జ‌ర్లాండ్ కు చెందిన నోవార్టిస్ సంస్థ దీన్ని త‌యారు చేసింది. దేని కోసం వాడ‌తారంటే.. ప‌సిపిల్ల‌ల్లో వ‌చ్చే జ‌న్యులోపాలను నిరోధించ‌టానికి ఈ మందును ఇంజెక్ట్ చేస్తారు. ఇలాంటి వాటి కోసం ఇప్ప‌టికే మందులున్నా. ఈ మందు సో స్పెష‌ల్ అంటున్నారు. ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న ఇంజెక్ష‌న్ల‌ను ప్ర‌తి ఏటా ప‌దేళ్ల పాటు చేయాల్సి ఉంటుంది. దీని ధ‌ర రూ.3కోట్లు.

తాజాగా మార్కెట్లోకి వ‌చ్చిన అతి ఖ‌రీదైన ఈ ఇంజెక్ష‌న్ ను ఒక్క‌సారి తీసుకుంటే చాలు.. ఇక జీవితంలో ఎలాంటి జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌ని చెబుతున్నారు. ఎఫ్ డీఏ దీనికి అనుమ‌తి ఇచ్చింది. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన మెడిసిన్ గా దీన్ని చెబుతున్నారు. ఇంకోమాట‌.. పైన చెప్పిన‌ట్లు దీని ఖ‌రీదు క‌చ్ఛితంగా చెప్పాలంటే.. రూ.14.50 కోట్లు. పైన వ‌దిలేసిన చిల్ల‌ర‌తో ఖ‌రీదైన ఫ్లాట్ వ‌చ్చేస్తుంది కదూ. మ‌రీ.. ఇంజెక్ష‌న్ ను వినియోగించే వారెంత ధ‌న‌వంతులో ఇక చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు క‌దూ?