Begin typing your search above and press return to search.

హ‌రీశ్ రావు సాక్షిగా...ఎమ్మెల్సీని ఏకిపారేశారు

By:  Tupaki Desk   |   19 Nov 2017 7:10 AM GMT
హ‌రీశ్ రావు సాక్షిగా...ఎమ్మెల్సీని ఏకిపారేశారు
X
టీఆర్ఎస్ నేత‌లపై విప‌క్ష నేత‌ల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి తాజాగా మ‌రోమారు బ‌హిర్గ‌తం అయింది. పార్టీ ముఖ్య నేత హ‌రీశ్ రావు సాక్షిగా...టీఆర్ ఎస్ ఎమ్మెల్సీపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత విరుచుకుప‌డ్డారు. అలా మండిప‌డిన మ‌హిళా నాయ‌కురాలు మాజీ మంత్రి గీతారెడ్డి కాగా...ఆమెతో సంవాదం పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ ఎస్‌ లో చేరిన ఎమ్మెల్సీ ఫ‌రీదుద్దీన్‌. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. అంతకు ముందు కోహీర్‌ మండలం సజ్జపూర్‌ గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో మాజీ మంత్రి - జహీరాబాద్ ఎమ్మెల్యే డా. జె.గీతారెడ్డి మాట్లాడుతూ.. జహీరాబాద్‌ కమ్యూనిటీ వైద్యశాలలోని డాక్టర్లందరినీ డిప్యూటేషన్‌ పై పంపించడంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 'మహిళలను గౌరవిం చకపోతే ఎక్కడైనా, ఎవరికైనా వినాశనం తప్పదు' అని మంత్రి హరీశ్‌ రావును - ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ నుద్దేశించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై ఫ‌రీదుద్దీన్ సైతం ఘాటుగానే రియాక్ట‌య్యారు. 'ప్రజలపై ఇప్పుడు మీరు చూపిస్తున్న శ్రద్ధలో పది శాతమైనా మంత్రిగా ఉన్నప్పుడు చూపించి ఉంటే మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలపై ఇప్పుడు చూపిస్తున్న శ్రద్ధలో పది శాతమైనా చూపించి ఉంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందేది' అని అన్నారు. 'ఎవరి బలమెంతో ఎన్నికల్లో తేల్చుకుందాం. చిల్లర రాజకీయాలు మానుకోవాలి' అని గీతారెడ్డి అన్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వావాదం జరిగింది. ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేశారు. చివరికి హరీశ్‌రావు కల్పించుకుని ఇద్దరిని సముదాయించడంతో సమావేశం సజావుగా సాగింది.

కాగా, అనంతరం జహీరాబాద్‌ లో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే గీతారెడ్డి మంత్రిపై మాటల తూటాలు పేల్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట అభివృద్ధి పనుల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. ప్రస్తుత టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. దళిత మహిళలపట్ల కొందరు ప్రతినిధుల తీరు మారాలన్నారు. లేకుంటే వారి ఉసురు తగులుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల్లో చాలామటుకు ఎస్సీ, ఎస్టీలకు సక్రమంగా ఆర్థిక సహాయం అందడంలేదన్నారు. దీంతో నిధులు మిగిలిపోతున్నాయన్నారు.