Begin typing your search above and press return to search.

అత‌డ్ని అంద‌రూ తిట్టారు..ట్రంప్‌ కు న‌చ్చాడు

By:  Tupaki Desk   |   19 Jun 2017 8:13 AM GMT
అత‌డ్ని అంద‌రూ తిట్టారు..ట్రంప్‌ కు న‌చ్చాడు
X
అంద‌రికి న‌చ్చ‌నిది ట్రంప్‌ కు మాత్రం న‌చ్చుతుందా? అన్న సందేహం ఈ ఉదంతం గురించి తెలిస్తే అనిపించ‌క మాన‌దు. ఒక టీచ‌ర్‌ ను మీడియా మొద‌లుకొని సోష‌ల్ మీడియా వ‌ర‌కూ అంద‌రూ త‌ప్పు ప‌డుతుంటే.. అత‌గాడు మాత్రం.. ప్రెసిడెంట్ ట్రంప్‌ కు నా స్టైల్ న‌చ్చిందంటూ చెబుతున్న మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇంత‌కీ జ‌రిగిందేమంటే..

అమెరికాలోని రోడ్ ఐలాండ్ రాష్ట్రానికి చెందిన ఓ గే టీచ‌ర్ నికోస్‌. అత‌గాడు 2017లో బెస్ట్ టీచ‌ర్ గా ఎంపిక‌య్యాడు. దీంతో.. అత‌గాడికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ను క‌లిసే అవ‌కాశం ల‌భించింది. వైట్ హౌస్‌ కు వెళ్లిన అత‌గాడు.. అధ్య‌క్షుల వారిని క‌లిసి ఆయ‌న‌తో ఫోటో దిగిన వైనం ఇప్పుడు సోష‌ల్ మీడియాలోనూ..మీడియాలోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఎంద‌కంటే.. ట్రంప్ ను క‌లిసిన స‌మ‌యంలో స‌ద‌రు గే టీచ‌ర్ స్టైల్ త‌ప్పులు ప‌ట్టేలా ఉండ‌ట‌మే. అధ్య‌క్షుల వారు కుర్చీలో కూర్చొని ఉంటే.. ఆయ‌న ప‌క్క‌న ఫ‌స్ట్ లేడీ మెలానియా ప‌క్క‌న గౌర‌వంగా నిలుచున్నారు. కానీ.. నికోస్ మాత్రం ఫ్యాంట్ జేబులో పెట్టుకొని మ‌రో చేతిలో విసినక‌ర్ర (ఫ్యాన్‌)ను ప‌ట్టుకొని ఫోటోకి ఫోజు ఇచ్చిన తీరు చ‌ర్చ‌గా మారింది. ప‌లువురు అత‌గాడిని పొగ‌ర‌మోతు గే టీచ‌ర్‌ గా త‌ప్పు ప‌ట్టారు కూడా. అయితే.. ఈ ఫోటోలో అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం కులాసాగా న‌వ్వుతుండ‌టం గ‌మనార్హం.

త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో స‌ద‌రు టీచ‌ర్ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. తాను ఎందుక‌లా చేశానో చెప్పుకొచ్చారు. తాను స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్‌ గా ప‌ని చేస్తున్నాన‌ని.. త‌మ‌లాంటి స్వ‌లింగ సంప‌ర్కులు అంద‌రితో స‌ర‌దాగా ఉంటార‌న్నారు. అయితే.. ప్ర‌జ‌లు త‌మ మాదిరిగా ఆలోచించ‌కుండా రాజ‌కీయం చేస్తుంటార‌ని అదే ఇబ్బంద‌ని పేర్కొన్నారు.

తాను ప‌ని చేసే బీక‌న్ స్కూల్లో దాదాపు ప‌న్నెండు మంది ట్రాన్స్ జెండ‌ర్ విద్యార్థులు ఉంటార‌ని.. తాను వైట్ హౌస్‌ కి వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత తెర మీద‌కు వ‌చ్చిన వివాదంతో వారు భ‌య‌ప‌డ్డార‌న్నారు. త‌మ లాంటి వారి మీద అమెరికా ప్ర‌భుత్వం నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌ద‌న్న సందేహ‌మే దీనికి కార‌ణంగా చెప్పారు. అధ్య‌క్షుల వారిని క‌ల‌వ‌టానికి వైట్ హౌస్ కి వెళ్లిన‌ప్పుడు త‌న కాల‌ర్ చుట్టూ వేసుకున్న గోల్డ్ ఆంక‌ర్ చూడటానికి గౌర‌వంగా ఉండ‌క‌పోవ‌చ్చు కానీ రోడ్స్ ఐలాండ్ రాష్ట్ర గుర్తు అని.. అందుకే ధ‌రించిన‌ట్లుగా చెప్పారు.

వైట్ హౌస్ లోని ఓవ‌ల్ ఆఫీసుకు వెళుతున్న‌ప్పుడు టీచ‌ర్లు త‌న‌ను గుర్తించ‌లేదు కానీ.. ట్రంప్ మాత్రం గుర్తించార‌ని.. నీ స్టైల్ న‌చ్చింద‌న్నారు. దీంతో త‌న ఆత్మ‌విశ్వాసం పెరిగింద‌న్న నికోస్‌.. ట్రంప్ తో ఫోటో దిగే స‌మ‌యంలో అక్క‌డి ఫోటోగ్రాఫ‌ర్ త‌న చేతిలో ఉన్న లేస్ విసినిక‌ర్ర‌ను త‌న‌తో ఉంచుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌లేద‌న్నాడు.

అయితే.. తాను దాన్ని ప‌క్క‌న పెట్ట‌న‌ని చిన్న గొడ‌వ పెట్టుకున్న‌ట్లుగా చెప్పిన అత‌డు.. ఇదే విష‌యాన్ని ట్రంప్ ను అడిగాన‌ని.. త‌న‌కేం ఫ‌ర్లేద‌ని ఆయ‌న బ‌దులిచ్చిన‌ట్లుగా చెప్పారు. దీంతో.. త‌న‌కు న‌చ్చిన‌ట్లే ఫోటో దిగిన విష‌యాన్ని స‌ద‌రు టీచర్ వెల్ల‌డించారు. త‌న ఫోటో కంటే చ‌ర్చించాల్సిన విష‌యాలు చాలానే ఉన్నాయ‌ని.. త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా ఫోటో దిగాన‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని చెప్పారు. నికోస్ దృష్టి కోణంలో చూసిన‌ప్పుడు.. ఫోటో దిగిన అత‌డు.. ఫోటోకు ఫోజు ఇచ్చిన ట్రంప్‌కు లేని బాధ జ‌నాల‌కు ఎందుక‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/