Begin typing your search above and press return to search.

సీ ఫుడ్ పార్క్ ఎంత డేంజరో చూశావా బాబు..?

By:  Tupaki Desk   |   26 Oct 2016 3:53 PM GMT
సీ ఫుడ్ పార్క్ ఎంత డేంజరో చూశావా బాబు..?
X
గోదావరి మెగా అక్వాఫుడ్ పార్క్ మీద అక్కడి స్థానికుల భయాందోళనలు ఎంత నిజమో ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి. ఫుడ్ పార్క్ కారణంగా నీటి వనరులు విషతుల్యం అవుతాయని.. పచ్చటి పొలాలు నాశనం అవుతాయని.. అక్కడి గ్రామాలు దారుణమైన కాలుష్యం బారిన పడతాయనంటూ.. అక్కడి బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టటం తెలిసిందే. అయితే.. వారి భయాల్ని కొట్టిపారేస్తూ ఏపీ అధికారపక్ష నేతలు తేలిగ్గా మాట్లాడటం కనిపించింది. మెగా పార్కును ఏర్పాటు చేస్తున్న కంపెనీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందంటూ అధికారపక్ష నేతలు ఎవరికి వారు సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్న పరిస్థితి.

అయితే.. తెలుగు తమ్ముళ్లు చెప్పినంత సీన్ లేదన్న విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని లేవనెత్తటం ద్వారా బయటకు వచ్చింది. మెగా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారి వాదనను తెరపైకి తీసుకొచ్చిన పవన్ కల్యాణ్.. వారి భయాలపై ప్రభుత్వం స్పందించాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో రివ్యూ చేసి.. కంపెనీ నుంచి సముద్రానికి పైపు లైన్ వేసి.. వ్యర్థాల్ని విడిచిపెట్టేలా చూడాలని ఆదేశించారు. దీంతో.. కాలుష్య నివారణ చర్యలు అరకొర అన్న విషయం స్పష్టమైన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామ పరిధిలోని నెక్కంటి సీ ఫుడ్స్ పరిశ్రమలో నిన్న.. ఈ రోజు (బుధవారం) గ్యాస్ లీక్ అయిన ఉదంతంలో అక్కడ పని చేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున అస్వస్థతకు గురి కావటం చర్చగా మారింది. ప్రమాదకరమైన గ్యాస్ లు విడుదలైన కారణంగా మంగళవారం దాదాపు పాతికమంది వరకూ అస్వస్థతకు గురైతే.. బుధవారం బాధితుల సంఖ్య మరో యాభై మంది ఉండటం పుడ్ పార్క్ ఎంత ప్రమాదకరమైనదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి. కాలుష్యం విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నా.. అందులో నిజం లేదన్న విషయం తాజా పరిణామం స్పష్టం చేస్తుంది. ఈ ఘటన చూసినప్పుడు ఫుడ్ పార్క్ మీద వెల్లువెత్తుతున్న ఆందోళనల్లో నిజం ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతంది. మరీ.. ఉదంతాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళుతున్నాయా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/