Begin typing your search above and press return to search.

ఆయ‌న కంట‌త‌డి.. టీడీపీ ద‌య‌నీయ స్థితిని చెబుతోందా..?

By:  Tupaki Desk   |   19 Aug 2019 9:25 AM GMT
ఆయ‌న కంట‌త‌డి.. టీడీపీ ద‌య‌నీయ స్థితిని చెబుతోందా..?
X
ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ప‌రిస్థితిపై చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో అయితే, నిన్న ఒక్క‌రోజులోనే క్యూ క‌ట్టుకుని మ‌రీ నాయ‌కులు బీజేపీలోకి చేరిన ప‌రిస్థితి క‌నిపించింది. అది కూడా పార్టీ అధినేత చంద్ర‌బాబు తెలంగాణ‌లో ఉన్న స‌మ‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. అలాంటి పార్టీ నుంచి జంప్ చేస్తున్న నాయ‌కులు ఇక‌, చాలు సేఫ్ సైడ్‌కు వ‌చ్చామ‌ని గుండెలు పీల్చుకోవ‌డం స‌హజం. నిజంగానే నాయ‌కులు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి చేరేది కూడా సేఫ్ కోస‌మే. అయితే, ఈ సంద‌ర్భంగా పార్టీ మారేవారు. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పార్టీని తిట్టిపోయ‌డం, నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం కామ‌న్‌.

కానీ, తెలంగాణ‌లో టీడీపీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న గ‌రిక‌పాటి మోహ‌న్‌ రావు.. చాలా వినూత్నంగా స్పందించారు. ఆయన బీజేపీలోకి వెళ్తున్నాన‌నే ఆనందం క‌న్నా కూడా.. టీడీపీలో ఉండ‌లేక పోతున్నాన నే బాధ స్ప‌ష్టంగా క‌నిపించింది. అంతేకాదు, పార్టీని వీడుతున్న క్ర‌మంలోనే ఆయ‌న ఏకంగా క‌న్నీటి ప‌ర్యంతం కావ‌డం అంద‌రినీక‌ల‌చి వేసింది! నిజంగా ఓ పార్టీతో ఇంత‌టి బంధం పెన‌వేసు కుంటారా? అని కూడా అనిపించింది. మ‌న‌సు చంపుకుని భాజ‌పాలో చేరుతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే, తాను చంద్ర‌బాబు నాయుడు తీరుని ఎప్పుడూ త‌ప్పుబ‌ట్టడం లేద‌నీ, పార్టీని స‌మూలంగా నాశ‌నం చేయాల‌నుకునేవారు కొంత‌మంది ఉన్నార‌ని ఆరోపించారు.

టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌కు ఏ ప‌ద‌వీ రాలేద‌నీ, పార్టీ కోసం చాలా పోరాటాలు చేశాన‌నీ, క‌ష్ట‌కాలం లో పార్టీ వెంట ఉన్నాన‌ని గ‌రిక‌పాటి చెప్పుకొచ్చారు. టీటీడీపీలో నాయ‌కులంటే ఇద్ద‌రే క‌నిపిస్తున్న ప‌రిస్థితి. నిజానికి, తెలంగాణ‌పై పార్టీ నాయ‌క‌త్వం మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉంటే ఈ ప‌రిస్థితి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, పార్టీని ఇంత‌గా ప్రేమించే నాయ‌కులున్న‌ప్పుడు… ఇలాంటి స‌మ‌యంలోనైనా వారికి ప్రాధాన్య‌త ఇచ్చి, కీల‌క బాధ్య‌త‌లు ఇచ్చి ప్రోత్స‌హించి ఉంటే పార్టీ ఉనికి నిల‌బ‌డేది. కానీ, ఏపీలో ఓట‌మి త‌రువాత తెలంగాణ‌లో పార్టీ శాఖ మీద పూర్తి స్థాయిలో చంద్ర‌బాబు నాయుడు దృష్టి పెట్ట‌లేని ప‌రిస్థితి ఉంది.

నిజానికి హైద‌రాబాద్‌లో డిసెంబ‌రులో ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌భ‌ల‌కు, రోడ్ షోల‌కు ప్ర‌జ‌లు పోటెత్తారు. దీనిని బ‌ట్టి అభిమానులు ఉన్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, వారిని పార్టీవైపు న‌డిపించ‌డంలోను, త‌గిన నాయ‌క‌త్వాన్ని అందించ‌డంలోనే లోపాలు జ‌రిగాయ‌నేది స్ప‌ష్టంగా తెలుస్తున్న మాట‌. ఏదేమైనా గ‌రిక‌పాటి వ్యాఖ్య‌ల్లోని అంత‌రార్థం అర్ధ‌మైతే.. నాయ‌కులు ఇప్ప‌టికైనా త‌ప్పుదిద్దుకుంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు