Begin typing your search above and press return to search.

గంటా వైఫ‌ల్యాల జాబితాలో ఆత్మ‌హ‌త్య‌లు ఒక్క‌టే కాద‌ట‌

By:  Tupaki Desk   |   16 Oct 2017 2:25 PM GMT
గంటా వైఫ‌ల్యాల జాబితాలో ఆత్మ‌హ‌త్య‌లు ఒక్క‌టే కాద‌ట‌
X
ఏపీలో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న విద్యార్థుల ఆత్మ‌హత్య‌లు - విద్యావ్య‌వ‌స్థ‌లో వైఫ‌ల్యాలు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు మెడ‌కు చుట్టుకుంటున్నాయి. ఏకంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జోక్యం చేసుకునే స్థాయికి చేర‌డం వెనుక గంటా నిష్క్రియ‌ప‌ర్వం కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఉన్నత విద్య - పాఠశాల విద్యా శాఖలో వెలుగుచూస్తున్న అక్రమాలపై ఆ శాఖ మంత్రి తరచూ విచారణకు ఆదేశించడం మిన‌హా - నివేదికలు వెలుగుచూస్తున్న దాఖలాలు లేవు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల అమలు నేతి బీరకాయలోని నేతి చందమేనన్నది బహిరంగ రహస్యమే. వరుస ఆత్మహత్యల నేపథ్యంలో కమిటీలు ఏర్పాటు చేయని కళాశాలలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కార్పొరేట్ కళాశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నా ఆ ఘటనలపై విచారణ మిన‌హా - తదుపరి ఏం చర్యలు తీసుకున్నారో దేవుడికే ఎరుక అని అంటున్నారు.

ఉన్నత విద్య - పాఠశాల విద్యా శాఖ పరిధిలో జరిగే వివిధ ఘటనలపై విచారణకు ఆదేశించే మంత్రి గంటా శ్రీనివాసరావు తదుపరి చర్యలపై మాత్రం స్పందించటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర వర్శిటీలో గతంలో ఫిజిక్స్ - గణితం పేపర్లు లీక్ అయినప్పుడు విచారణకు ఆదేశించారు. ఆ ఘటనపై వేసిన విచారణ కమిటీలు ఏ నివేదిక ఇచ్చాయో? అన్నది నేటికీ చిదంబర రహస్యం. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ ఘటన జరిగిన సమయంలో హడావుడి తప్ప ఆయా కళాశాలలపై తీసుకున్న చర్యలేమీ లేవు. పరీక్ష పేపరును సెట్ చేయాల్సిన మార్కుల కంటే ఎక్కువ ఇచ్చినా అది పెద్దతప్పు కానట్లుగా సర్దిచేప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏయూలో వివిధ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్థారించినా, తదుపరి చర్యల్లో కూడా జాప్యం జరగడం గమనార్హం.

పాఠశాల విద్యకు సంబంధించి ఇటీవల ఎస్‌ ఎ-1 పరీక్ష పేపరు లీక్ అయింది. అప్పటికే నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దుచేస్తూ, మిగిలిన పరీక్షలను వాయిదా వేయటమూ తెలిసిందే. ఈ ఘటనలో విచారణ మినహా - లీకువీరులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలియని స్థితి. పాఠశాల విద్యలో సిసిఇ కింద 20 మార్కులకు ఎస్‌ ఎ ఆధారంగా మార్కులు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది.కృష్ణా జిల్లా నూజివీడు ఐఐఐటిలో జరిగిన ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం మాత్రమే వివిధ విచారణ పర్వాల్లో వెలుగుచూసిన ఒక అంశం. విశాఖలో జిల్లా గ్రంథాలయ సంస్థ టెండరు వ్యవహారంపై వేసిన కమిటీ నివేదిక కూడా అంతే. వివిధ ఘటనలపై విచారణకు ఆదేశించడానికే పరిమితమవుతున్న మంత్రి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్న సందర్భాలు దాదాపు ఉండటం లేదు. వివిధ శాఖల అధికారులు - మంత్రులు ఆదేశించిన విచారణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించాల్సిన అవసరముందని అంటున్నారు.