Begin typing your search above and press return to search.

రెండునాల్కలు:జగన్ తిట్లకు-మాయ మాటలకు..

By:  Tupaki Desk   |   21 Feb 2018 4:41 AM GMT
రెండునాల్కలు:జగన్ తిట్లకు-మాయ మాటలకు..
X
తెలుగుదేశం పార్టీ అధినేత పడుతున్న కష్టాన్ని ఆయన మంత్రి వర్గ సహచరులందరూ ఎంతో కొంత పంచుకోవడానికి సిద్ధమైపోయినట్లుగా కనిపిస్తోంది. జగన్ ను తిట్టడంలో తాము తలా కొంత భారం పంచుకుని.. అధినేతకు ఉపశమనం కలిగించాలని మంత్రులందరూ సానుభూతితో వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి దేశం నేతలు చాలా గందరగోళంలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది.

మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకవైపు ఉమ్మడిగా అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మొన్నటిదాకా తెలుగుదేశం పాడిన అఖిలపక్షం అనే ఆలోచనకు అనుకూలమైన వాదన ఇది. మంచిదే.. చాలా పార్టీలు - చాలా మంది తటస్థులు కూడా అదే కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఒక్కటే గళాన్ని వినిపించినప్పుడే కేంద్రంలో కదలిక వస్తుందని అంటున్నారు.

ఒకవైపు కలసి పోరాడాలి అంటూనే.. మరోవైపు జగన్ ను కుట్రదారు అని, కేసుల్లోంచి బయటపడడం కోసం రాష్ట్రప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. గంటా శ్రీనివాసరావు వైఖరి చూస్తోంటే.. నోటితో రమ్మని ఆహ్వానిస్తూ... చేత్తో పోపొమ్మని సైగ చేసే ద్వంద్వ వైఖరిలాగా ఉన్నదని నలుగురూ అనుకుంటున్నారు. రాష్ట్రం కోసం ఉమ్మడిగా పోరాడాలి అంటూనే.. జగన్ ను ఇలా తిట్టిపోస్తుండడం అదెక్కడి.. ఉమ్మడిపోరాట చిహ్నం - అదెలాంటి పాజిటివ్ సంకేతం అని పలువురు విమర్శిస్తున్నారు.


ఇంత అర్థంలేని విమర్శలా..

జగన్మోహన్ రెడ్డి కేసులనుంచి బయటపడడానికి కేంద్రం వద్ద సాగిలపడ్డాడు అనే విమర్శ ఇవాళ్టిది కాదు. ఈ ఒక్క విమర్శను నమ్ముకుని.. జగన్ పడుతున్న మొత్తం శ్రమను బద్నాం చేసేయవచ్చునని తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా తపన పడుతోంది. జగన్ ను కొత్తగా విమర్శించడానికి తెలుగుదేశం కోటరీ వద్ద అస్త్రాలు అయిపోయాయి. లక్షకోట్ల అవినీతి అనే ఆరోపణ పాచిపోయింది. దాని ఊసెత్తడం కూడా మానేశారు. అవినీతి కేసుల వ్యవహారం నింపాదిగా నడిచిపోతూ ఉంది.

మరేమీ విమర్శలు లేక కేంద్రంతో కుమ్మక్కు అయ్యారు అనే పాట ఒక్కటే పాడుతున్నారు. కుమ్మక్కు అంటే.. ఒక్కరు చేసేది కాదు.. ఇద్దరు చేసేది. ఇలాంటి నేలబారు విమర్శలు చేస్తే జగన్ ను ఎంతగా విమర్శిస్తున్నారో.. భాజపాను కూడా అంతే విమర్శిస్తున్నట్టు లెక్క. ఆ సంగతి వారు గ్రహిస్తున్నారో లేదో తెలియదు.

అలాగే.. రాష్ట్రప్రయోజనాలను జగన్ కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారు అని గంటా అంటున్నారు. తాను అధికారంలో లేనప్పుడు ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం ఆయనకు ఎలా సాధ్యం? అయితే గియితే అది పాలకులకు సాధ్యం కావాలి. అందుకే తెదేపా వాళ్లు మరీ ఇంత తలాతోకా లేకుండా అర్థం లేని విమర్శలు చేస్తున్నారని జనం అనుకుంటున్నారు.