జగన్‌కు కలిసొచ్చే పని చేయనున్న బాబు ?

Thu Aug 17 2017 10:04:47 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమిటి?.. ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి కలిసొచ్చే పని చేయటం ఏమిటి? అంటూ అవాక్కు అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఆయన ఇదే రీతిలో తాజాగా పావులు కదుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికే తన సర్వశక్తులు ఒడ్డుతున్న చంద్రబాబు.. తాజాగా మరో ఎత్తు వేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జగన్ పార్టీకి చెందిన నేత ఒకరిని తన పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నానికి తెర తీశారు.

అయితే.. ఈ ఎత్తుగడ సానుకూలంగా కంటే ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి రాజకీయాల్లో నేతలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్లటం సహజమే. కానీ.. ఎన్నికల ప్రక్రియ కీలకదశకు చేరుకున్న వేళ.. ప్రత్యర్థిపార్టీని దెబ్బ తీసేలా అధికారపక్షం అడుగులు వేయటాన్ని  ఓటర్లు అహంకార చర్యగా భావిస్తారు. అది అంతిమంగా అధికారపక్షానికి చేటుగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నంద్యాల మాజీ ఎంపీగా.. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యేగా వ్యవహరించి.. ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న గంగుల ప్రతాపరెడ్డిని సైకిల్ ఎక్కించే దిశగా బాబుపావులు కదుపుతున్నారు.

దివంగత మహానేత వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన గంగుల.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారటం అంటే జగన్ పార్టీ కంటే టీడీపీకే ఎక్కువ నష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దొంగ దెబ్బలు తీయటంలో ఆరితేరి పోయారంటూ విపక్ష నేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వలేక సతమతం అవుతున్న ఏపీ అధికారపక్షానికి గంగుల ఎపిసోడ్ మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉప ఎన్నికకు ముందు కానీ.. ఎన్నిక ప్రక్రియ మొదలైనప్పుడో ఈ మార్పు ఉంటే మరోలా ఉండేదని.. పోలింగ్‌కు వారం ముందు ఇలాంటివి చోటు చేసుకోవటం విపక్ష పార్టీ పట్ల సానుభూతిగా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తాజాగా గంగుల ప్రభాకర్ రెడ్డిని మంత్రి అచ్చెన్నాయుడితో పాటు.. మాజీ మంత్రి.. గతంలో వైఎస్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించి.. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిలు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు.

తనకేమీ పదవులు వద్దని.. కేవలం పార్టీలో చేరి పని చేయాలని ఉన్నట్లుగా ఆయన చంద్రబాబుతో అన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా.. రేపొద్దున్న ఎన్నికల వేళలో కొత్త తలనొప్పులు తప్పించి మరేమీ ఉండదన్న భావన వ్యక్తమవుతోంది. ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీకి.. గంగుల ఫ్యామిలీకి మధ్యనున్న రచ్చ తెలిసిందే. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలో కిందామీదా పడుతున్న అధికారపక్షానికి గంగుల చేరిక మరో తలనొప్పే అవుతుందే తప్పించి కలిసి వచ్చే చాన్స్ లు తక్కువంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉప ఎన్నికల నేపథ్యంలో అధికారపార్టీ జోరు అంతగా లేదన్న  మాట వినిపిస్తున్న వేళ.. గంగుల ప్రతాపరెడ్డిని పార్టీలోకి తీసుకోవటం ప్లస్ కంటే.. మైనస్ గానే మారుతుందన్న భావన వ్యక్తమవుతోంది. తాజా పరిణామం వైఎస్ జగన్ కు లాభంగా మారుతుందన్నమాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.