Begin typing your search above and press return to search.

ఆ వివ‌రాలు చెప్పి కేసీఆర్ బుక్ అయ్యారా?

By:  Tupaki Desk   |   25 May 2017 4:41 AM GMT
ఆ వివ‌రాలు చెప్పి కేసీఆర్ బుక్ అయ్యారా?
X
గ‌డిచిన మూడు రోజులుగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ద‌ళితుల‌తో స‌హ‌పంక్తి భోజ‌న‌లు చేయ‌టం.. వెనుక‌బ‌డిన వ‌ర్గాలకు.. ద‌ళితుల‌కు పెద్ద పీట వేసిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన వైనం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. అమిత్ షా ప‌ర్య‌ట‌న మీద రియాక్ట్ అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం తెలిసిందే.

రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌తో పాటు.. ఊహించ‌ని రీతిలో కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసిన అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు కేసీఆర్‌. అమిత్ షా త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చేసిన భోజ‌నాలకు సంబంధించి కేసీఆర్ చెప్పిన మాట‌లు సంచ‌ల‌నంగా మారాయి. ద‌ళితుల‌తో భోజ‌నం చేసిన‌ట్లు క‌నిపించిన అమిత్ షా అండ్ కో కేవ‌లం షో మాత్ర‌మే చేసిన‌ట్లుగా విమ‌ర్శించారు. అమిత్ షాకు భోజ‌నం ఏర్పాట్లు చేసింది ద‌ళిత కార్య‌క‌ర్త‌లు కార‌ని.. క‌మ్మ‌గూడెం పొల్లాల్లో రెడ్డి వ‌ర్గీయులు భోజ‌నాలు సిద్ధం చేసిన‌ట్లుగా కేసీఆర్ వెల్ల‌డించారు.

దేశాన్ని ఏలే పార్టీకి చెందిన జాతీయ అధ్య‌క్షుడి ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి కీల‌క‌మైన అతి చిన్న విష‌యాల్ని సైతం కేసీఆర్ ప్ర‌స్తావించ‌టం.. జ‌రుగుతున్న ప్ర‌చారానికి.. వాస్త‌వానికి మ‌ధ్య‌నున్న అంత‌రాన్ని విప్పి చెప్పిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే.. కేసీఆర్ చెప్పిన మాటల్లో ఏ మాత్రం నిజం లేద‌ని చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గంగిడి మ‌నోహ‌ర్ రెడ్డి. తాను చెబుతున్న మాట‌ల్ని నిరూపించేందుకు సైతం సిద్ధ‌మ‌న్న ఆయ‌న‌.. త‌న సీఎం ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామాకు సిద్ధ‌మా అంటూ స‌వాలు విసిరారు.

క‌మ్మ‌గూడెం తోట‌ల్లో అమిత్ షాకు కేట‌రింగ్ ద్వారా భోజ‌నాలు పంపిన‌ట్లుగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్లో నిజం లేద‌ని.. తేర‌ట్ ప‌ల్లి గ్రామ ప‌రిధిలోని క‌మ్మ‌గూడెం పొలాల్లో భోజ‌నాలు సిద్ధం చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. కేసీఆర్ పేర్కొన్న‌ట్లుగా అవి తోట‌లు కావ‌ని.. పొలాల‌న్నారు.

ప‌ద్మ‌శాలీ యువ‌కుడు ర‌వి పొలాన్ని చంద్ర‌య్య కౌలుకు సాగు చేస్తుండ‌గా.. దాన్ని శుభ్రం చేయించి వంట‌లు చేయించిన‌ట్లుగా వెల్ల‌డించారు. మ‌ర్రిగూడ మండ‌లం కొండూరు గ్రామ ద‌ళిత కార్య‌క‌ర్త‌లు యాద‌గిరి.. శ్రీకాంత్ లు వంట‌లు సిద్ధం చేసిన‌ట్లుగా చెప్పిన మ‌నోహ‌ర్ రెడ్డి.. అమిత్ షా స‌హ‌పంక్తి భోజ‌నాన్ని తాము ఆటోల్లో త‌ర‌లించిన‌ట్లుగా వెల్ల‌డించారు. అమిత్ షా భోజ‌నాలు వండింది ఎవ‌ర‌న్న విష‌యంలో కేసీఆర్ త‌ప్పులో కాలేశారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మీడియా స‌మావేశంలో కేసీఆర్ చెప్పిన వివ‌రాలు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర్చ‌ట‌మే కాదు.. సీఎంకున్న నెట్ వ‌ర్క్ ఎంత‌న్న‌ది తెలిసి వ‌చ్చినా.. బీజేపీ నేత‌లు వినిపిస్తున్న మాట‌ల్ని విన్న‌ప్పుడు మాత్రం..స‌మాచారం సేక‌రించే విష‌యంలో కేసీఆర్ ఏమైనా త‌ప్పులో కాలేశారా? అన్న సందేహం రాక మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/