Begin typing your search above and press return to search.

గండ్రకు రెండు ప‌ద‌వుల హామీ.. ఏమంటే?

By:  Tupaki Desk   |   23 April 2019 4:43 AM GMT
గండ్రకు రెండు ప‌ద‌వుల హామీ.. ఏమంటే?
X
గండ్ర ఫ్యామిలీ గులాబీ కారెక్కింది. మిగిలిన నేత‌ల‌కు కాస్త భిన్నంగా గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి త‌న స‌తీమ‌ణితో క‌లిసి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రెఢీ అయిపోయారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో భూపాలప‌ల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొంద‌గా.. ఆయ‌న స‌తీమ‌ణి గండ్ర జ్యోతి డీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని నిర్వ‌హిస్తున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి కేటీఆర్ తో భేటీ అయి.. పార్టీలో చేరేందుకు త‌మ సంసిద్ధ‌త‌ను తెలిపారు.

విప‌క్షం నుంచి జంప్ అయి.. అధికార‌ప‌క్షంలో చేరే ప్ర‌క్రియ‌లో చివ‌రి అంక‌మైన కేటీఆర్ ను క‌లిసే కార్యక్ర‌మం సోమ‌వారం రాత్రి దిగ్విజ‌యంగా పూర్తి అయ్యింది. కేటీఆర్ ను క‌లిసిన సంద‌ర్భంలో రెండు అంశాలు చోటు చేసుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. అయితే.. కేటీఆర్ కు పూల బొకే ఇవ్వ‌టం.. లేదంటే.. కేటీఆరే చిన్న మొక్క ఒక‌దాన్ని పార్టీలో చేరే నేత‌కు ఇవ్వ‌టం. తాజా ఎపిసోడ్ లో కేటీఆర్ చేతికి గండ్ర ఫ్యామిలీ బొకే ఇచ్చేశారు.

పార్టీలో చేరాల‌న్న గండ్ర ఫ్యామిలీ ఆస‌క్తిని కేటీఆర్ ఓకే చేసేశారు. దీనికి త‌గ్గ‌ట్లే టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ను క‌లిసిన అనంత‌రం గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి.. ఆయ‌న స‌తీమ‌ణి జ్యోతిలు ఇద్ద‌రూ పార్టీకి గుడ్ బై చెబుతున్న‌ట్లుగా ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వారో అంశాన్ని ప్ర‌స్తావించారు. అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్ర‌మించిన అన్ని ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న గండ్ర‌కు 2007లో వైఎస్ పుణ్య‌మా అని ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం 2009లో భూపాల‌ప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర‌.. పార్టీ చీఫ్ విప్ గా ప‌ని చేశారు. 2014 ఎన్నిక‌ల్లో ఓడిన ఆయ‌న‌.. గ‌త డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ నామ‌రూపాల్లేకుండా చేయ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న గులాబీ బాస్ ఆకాంక్ష‌కు త‌గ్గ‌ట్లే ఇప్ప‌టికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. గండ్ర 12 ఎమ్మెల్యే కానున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. పార్టీలో చేరిన గండ్ర ఫ్యామిలీకి రెండు ప‌ద‌వులు ఇచ్చేందుకు ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. గండ్ర‌కు చీఫ్ విప్.. ఆయ‌న స‌తీమ‌ణి జ్యోతికి జెడ్పీ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇస్తామ‌న్న హామీ ల‌భించిన‌ట్లుగా స‌మాచారం. గండ్ర ఎగ్జిట్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు ప్ర‌య‌త్నించినా ఆయ‌న మాత్రం స‌సేమిరా అని చెప్ప‌ట‌మే కాదు.. మ‌రికొన్ని రోజుల త‌ర్వాత పార్టీ మారాల‌నుకున్న ఆయ‌న‌.. ముందుగా చేరిపోవ‌టం గ‌మ‌నార్హం.