గల్లా మంత్రాంగం!... మహేశ్ లాగేస్తున్నారా?

Tue Mar 26 2019 23:00:01 GMT+0530 (IST)

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏపీలోని అధికార పార్టీకి చాలా కీలకమైనవనే చెప్పాలి. ఆవలి వైపున బలమైన ప్రత్యర్థి రూపంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబడి ఉన్న నేపథ్యంలో టీడీపీలో ఓటమి భయం కొట్టొచ్చినట్లుగానే కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఆ పార్టీతో పాటు ఆ పార్టీకి చెందిన చాలా మంది కీలక నేతల ముఖాల్లోనూ ఓటమి భయం స్పష్టంగానే కనిపిస్తున్న విశ్లేషణలూ ఉన్నాయి. ఈ జాబితాలో గుంటూరు ఎంపీగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కూడా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం గల్లాపై వైసీపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నిలబెట్టింది. స్థానిక నేతగానే కాకుండా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగుతున్న నేతగా - నిన్నటిదాకా టీడీపీలోనే కొనసాగి ఇప్పుడు వైసీపీలోకి చేరిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో మెజారిటీ భాగం మోదుగుల వెంటే ఉన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. దీంతో తన గెలుపు అంత ఈజీ కాదని గల్లా తెలుసుకున్నారట.అయితే ఓడిపోతామన్న భావన ఉన్నా... పోటీ నుంచి తప్పుకుని పారిపోలేరు కదా. గల్లా కూడా అంతే. మరి బరిలో నిలిచి కూడా గెలుపు కోసం యత్నించకుండా ఉండలేరు కదా. ఈ క్రమంలోనే యోచించిన గల్లా... సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా ఎదిగి - వివాద రహితుడిగా ఉన్న తన తన భార్య సోదరుడు మహేశ్ బాబు గనుక ప్రచారం చేస్తే... తన గెలుపు అవకాశాలు మెరుగవుతాయని లెక్కలేశారు. ఈ లెక్కలు ఏ మేరకు నిజమో తెలియదు గానీ... మహేశ్ బాబు ఎన్నికల ప్రచారానికి ముందుకు వస్తారా? ఇప్పటిదాకా సింగిల్ వివాదంలోనూ తలదూర్చిన దాఖలా లేని మహేశ్... ఇప్పుడు కాదు ఇక ముందు కూడా ఎన్నికల్లోకి గానీ - ఎన్నికల ప్రచారంలోకి దిగడం కానీ చేస్తారని అనుకోలేం. ఎందుకంటే వివాదాలకు మహేశ్ ఎప్పుడూ దూరంగానే ఉంటారు. గడచిన ఎన్నికల్లోనూ గల్లా గుంటూరు బరిలో నిలిచిన సందర్భంగా... మహేశ్ ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ఆడియో - వీడియోల ద్వారానైనా ప్రచారం చేస్తారా? అన్న అనుమానాలు కూడా రాగా... అందుకూ దూరంగానే ఉన్న మహేశ్... కేవలం ఓ ట్విట్టర్ మెసేజ్ ద్వారా గల్లాకు ఓటేయాలని చెప్పి ఊరుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది కదా.

మరి ఏం చేయాలి? గల్లా నేరుగా మహేశ్ దగ్గరకే వెళ్లి.. ప్రస్తుత పరిస్థితిని వివరించి తనకు అనుకూలంగా ప్రచారం చేయాలని అభ్యర్థించారట. అయితే తమ్ముడు తమ్ముడే... పేకాట పేకాటే అన్న చందంగా సినిమాల్లో - అందులోనూ వివాదాలకు దూరంగా ఉన్న తనను మాత్రం రాజకీయాల్లోకి లాగొద్దని గల్లాకు మహేశ్ బాబు తేల్చి చెప్పారట. అంతగా కావాలంటే... గతంలో మాదిరిగానే ట్టిట్టర్ ద్వారా పోస్టులు పెడతాను తప్పించి డైరెక్టుగా ప్రచారంలోకి వచ్చేది లేదని తేల్చేశారట. దీంతో ఇలా పని కాదనుకున్నారో ఏమో తెలియదు గానీ... గల్లా మరో కొత్త మార్గంలో మహేశ్ ను దువ్వేందుకు యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా... కేంద్రంపై తాను చేస్తున్న పోరాటాలను ఆపేందుకే తనపై ఐటీ రైడ్స్ జరిగాయని మహేశ్ బాబుని కూడా అందుకే టార్గెట్ చేశారని గల్లా ఆరోపిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. గుంటూరు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇటీవలే ఓ పుస్తకం విడుదల చేసిన ఆయన.. ఆ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఈ తరహాలో గల్లా యత్నాలకు మహేశ్ బాబు పడిపోతారో?  లేదంటే తనదైన వైఖరికి కట్టుబడి ఉంటారో చూడాలి.