Begin typing your search above and press return to search.

హైలెట్స్: అవిశ్వాసంపై ఎంపీ గ‌ల్లా స్పీచ్

By:  Tupaki Desk   |   20 July 2018 8:53 AM GMT
హైలెట్స్: అవిశ్వాసంపై ఎంపీ గ‌ల్లా స్పీచ్
X
యావ‌త్ దేశం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మాన చ‌ర్చ‌.. అనుకున్న స‌మ‌యానికే మొద‌లైంది. ముందుగా అనుకున్న‌ట్లే.. మోడీ స‌ర్కారుపై తాము పెట్టిన తీర్మానంపై చ‌ర్చ‌ను త‌న‌తో మొదలు పెట్టారు ఏపీ టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌. ఊహించిన‌ట్లే.. ప‌దునైన వాద‌న‌ను రాసుకొచ్చిన కాగితాల్ని చ‌దువుతూ గ‌ల్లా జ‌య‌దేవ్ మోడీ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు.. ప్ర‌స్తావించిన అంశాల్ని చూస్తే..

= ఎన్నికలకు ముందు మోదీ ఏపీకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. తెలుగు తల్లిని కాంగ్రెస్‌ రెండు ముక్కలు చేసిందని మోదీ అన్నారు. నాలుగేళ్లుగా మోదీ ఏదో చేస్తారని ప్రజలు ఎదురు చూశారు. తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారని మోదీ అన్నారు. హోదా ఇస్తానని ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ముడిపెడుతున్నారు. మోదీ మోసం చేశారని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నెల్లూరు, విశాఖ, తిరుపతి సభల్లో మోదీ ఇచ్చిన హామీలకు విలువ లేదా?..

= ఆర్థిక సంఘం సాకు చూపి ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరించడం సరికాదు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఆర్థిక సంఘం సభ్యులు ఇచ్చారు. ఏపీకి హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం ఏనాడు చెప్పలేదు. ఇది దేశాన్ని - ప్రజలను పక్కదారి పట్టించడమేనని భావిస్తున్నాం.

= ఏపీకి హోదా ఇవ్వకుండా 11 రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నారు. సభలో ఒక మాట.. బయట ఒక మాట్లాడటం సరికాదు. మార్చి 15 - 2018న హోదా గురించి రాజ్యసభలో మంత్రి అభిజిత్‌ మాట్లాడారు కూడా. హోదా ఇస్తానని మ్యానిఫెస్టోలో చెప్పిన బీజేపీ మొండిచేయి చూపించింది.

= హోదా కావాలని మేము అడిగితే.. దానికి సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్నారు.. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తామన్నారు.. అది నామమాత్రమే. ఏపీ సంబంధించిన విషయాలు ప‍్రధాని కార్యాలయంలో ఆగిపోయాయి

= ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా ఏపీకి నిధులిస్తామన్న కేంద్రం హామీ ఏమైంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఎన్నో నిధులు రావాలి. ఢిల్లీ కంటే అద్భుతమైన రాజధాని నిర్మించి ఇస్తామని మోదీ చెప్పారు. రూ. 1500 కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది? ఇప్పుడు నిధులు లేమితో ఇబ్బందులు వస్తున్నాయి.

= అవినీతి పరులకు ప్రధాని కొమ్ము కాస్తున్నారు. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఆర్థిక నేర‌గాడు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి వ‌ర్గీయుల‌కు టికెట్లు ఇచ్చారు.

= ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. హోదాపై మాట మార్చారన్న విషయం ప్రజలకు అర్థమైంది. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనటం వాస్తవ విరుద్ధం. ప్రణాళిక సంఘం సాకుతో హోదా ఇవ్వకపోవటం సరికాదు. స్పెషల్‌ ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఒక్క పైసా ఏపీకి విదల్చలేదు. ఇప్పటికైనా హోదా ఇవ్వాలి.

= రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్‌... తెలంగాణ కాదు. విభజనలో భాగంగా ఆస్తులు తెలంగాణకు.. ఆంధ్రప్రదేశ్‌ కు అప్పులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారు. విభజన తర్వాత ఆ‌ నగరం తెలంగాణలోనే ఉండిపోయింది. దీంతో ప్రధాన ఆదాయ వనరును ఏపీ కోల్పోయింది.

= ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందడంలో కాంగ్రెస్‌ తో పాటు భాజపా ప్రధాన పాత్ర పోషించింది. ఇదే సభలో ఆ బిల్లును ఎలా ఆమోదించారో దేశం మొత్తం చూసింది. సమైఖ్యంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉండేది. ఇప్పుడు అన్నింటికంటే వెనుకబడి ఉంది. వ్యవసాయంలో కాస్త మెరుగ్గా ఉన్నా.. పారిశ్రామిక - సేవల రంగంలో అట్టడుగునే ఉంది. తలసరి ఆదాయంలోనూ ఏపీ వెనుకబడే ఉంది.

= కాంగ్రెస్‌ తెలుగుతల్లిని రెండుగా చీల్చి రాష్ట్ర విభజన చేసిందని మోదీ అప్పట్లో అన్నారు. కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని వ్యాఖ్యానించారు. అయితే విభజన పాపంలో భాజపాకు సగం పాత్ర ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా?. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని మీ పార్టీ సభ్యులే డిమాండ్‌ చేసిన సంగతి గుర్తుందా?. తిరుపతి, నెల్లూరు సభల్లో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా?

= 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వొద్దని చెప్పిందని కేంద్రం చెబుతోంది. ఇది పూర్తిగా అసంబద్ధం. మేమెప్పుడూ అలా చెప్పలేదని 14వ ఆర్థిక సంఘానికి ప్రాతినిధ్యం వహించిన గోవిందరావు చెప్పారు. ప్రధాని - ఆర్థిక మంత్రి అవాస్తవ విషయాలను గమనించాలి. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి.

= బీజేపీ మమ్మల్ని ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా చూస్తోంది తప్ప.. దక్షిణాది రాష్ట్రాలతో కాదు. పోలవరానికి ఇచ్చే నిధులు విభజన చట్టంలోని సెక్షన్‌-90 కింద ఇచ్చేవి. ఏపీకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా విభజన చట్టంలో భాగంగా ఇచ్చినదే. ఆ నిధులన్నీ కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే.

= ఎంతో ఉదారంగా సాయం చేశామని చెప్పడం శుద్ధ అబద్ధం. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3వేల కోట్లు, గుజరాత్‌లో పటేల్‌ విగ్రహానికి రూ.3,500కోట్లు ఇచ్చారు. మా రాజధాని నిర్మాణానికి ఇచ్చింది మాత్రం వెయ్యి కోట్లు. పోలవరానికి రూ.58,600 కోట్లయితే.. రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.

= దిల్లీ కంటే పెద్దది, ఉత్తమమైన రాజధాని నిర్మిస్తామని ప్రధానే స్వయంగా హామీ ఇచ్చారు. ఆయనిచ్చిన హామీతో రైతులంతా ముందుకొచ్చి ఉదారంగా భూములిచ్చారు. రూ.1500 కోట్ల‌తో అత్యుత్త‌మ రాజ‌ధానిని నిర్మించొచ్చా? బాహుబ‌లి సినిమాకే రూ.1800 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి.

= ఢిల్లీకి రెండింతల విస్తీర్ణంలో గుజరాత్‌లో దోలేరో నగరం కడుతున్నారు. కజకిస్తాన్‌ రాజధాని అస్తానాను పరిశీలించి అలాంటి రాజధాని నిర్మించుకోండని ప్రధాని స్వయంగా చెప్పారు. ఏపీ రాజధాని కోసం రూ.50 వేల కోట్ల విలువైన భూములు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. నవీ ముంబై కోసం 40 వేల ఎకరాలు సేకరించారు. ఇప్పుడు అమరావతి కోసం 30 వేల ఎకరాలు ఎందుకంటున్నారు?

= కేంద్రం రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చామని చెబుతోందని, అందులో రూ.1000 కోట్లు గుంటూరు, విజయవాడలో భూగర్భ డ్రైనేజీ కోసం ఇచ్చిందే. గుంటూరు లాంటి చిన్న పట్టణంలో భూగర్భ డ్రైనేజీకి రూ.1000 కోట్లు ఖర్చు అయితే...రూ.1500 కోట్లతో రాజధాని ఎలా నిర్మిస్తాం?

కీల‌క వ్యాఖ్య‌లు

+ త‌ల‌స‌రి ఆదాయంలో ఏపీ వెనుక ప‌డింది

+ ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అన్నింట్లోనూ వెనుకే

+ వృద్ధి రేటు బాగున్నా ఉన్నా.. త‌ల‌స‌రి ఆదాయంలో అంద‌రికంటే వెనుకే!

+ విభ‌జ‌న పాపంలో బీజేపీది స‌గ భాగం

+ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై మోడీ స‌ర్కారు వివ‌క్ష‌

+ ఇది బీజేపీ.. టీడీపీకి యుద్ధం కాదు

+ చేసిన వాగ్దానాల్ని మ‌ర‌వ‌టం స‌రికాదు

+ రూ.16వేల రెవెన్యూ లోటుకు రూ.3800 కోట్లు చూపిస్తారా?

+ ఏపీ భ‌విష్య‌త్తును రాజ‌కీయ‌క్రీడ‌గా చేశారు

+ ప్ర‌త్యేక ప్యాకేజీల‌పైనా ద్రోహ‌మే

+ ప‌దేళ్ల పాటు ప్ర‌త్యేక హోదాపై బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నిక‌ల మేనిఫేస్టోలో ప్ర‌క‌టించారు కూడా

+ తిరుప‌తి.. నెల్లూరులో మీరిచ్చిన ప్ర‌త్యేక హోదా హామీ గుర్తుందా?

+ గ‌త ప్ర‌ధాని ఇచ్చిన హామీలపై గౌర‌వం లేదా?

+ కొత్త రాజ‌ధానికి ఇచ్చేది వెయ్యి కోట్లా?

+ ఏపీపై కేంద్రం అద‌నంగా కురిపించిన వ‌రాలు ఏమిటి?

+ వాస్త‌వాలు తొక్కి ప‌డితే అవి తిర‌గ‌బ‌డ‌తాయి

+ అధిప‌త్యానికి.. నైతిక‌త‌కు మ‌ధ్య పోరాటం

+ అమిత్ షా మాపై యుద్ధం ప్ర‌క‌టించారు

+ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు నిధులు ఇవ్వ‌క‌పోవ‌టం జాతీయ స‌మ‌స్య‌

+ వెన‌క‌బ‌డిన జిల్లాల నిధులు వెన‌క్కి తీసుకుంటారా?

+ చేతులు జోడించి న‌మ‌స్క‌రిస్తున్నా.. ప్ర‌త్యేక హోదా ఇవ్వండి

+ ప్ర‌త్యేక హోదా 14వ ఆర్థిక సంఘం ఇవ్వొద్ద‌న్న‌ది మిథ్యే

+ తిరుప‌తి.. నెల్లూరులో మీరిచ్చిన హామీ గుర్తుందా?

+ కాంగ్రెస్ త‌ల్లిని చంపి.. పిల్ల‌ను బ‌తికించింద‌ని మీరు అన్నారు గుర్తుందా?

+ విగ్ర‌హాల విలువ కూడా మా రాజ‌ధాని చేయ‌దా?

+ ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించింది

+ కొత్తగా ఏర్పాటైన ఏపీకి తీవ్రమైన లోటు

+ మోదీ పాలనతో ఏపీ ఇబ్బందులకు గురయ్యింది

+ రూ.లక్షా 3 వేల కోట్ల రుణ భారం ఏపీపై పడింది

+ విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారు

+ విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయింది

+ ఆంధ్రపదేశ్‌కు రాజధాని, మౌలిక సదుపాయాలు లేవు

+ అవిశ్వాసం అనేది బీజేపీ-టీడీపీ మధ్య వార్ కాదు. మెజారిటీ-మొరాలిటీ మధ్య జరుగుతున్న యుద్ధం

+ ఇతర రాష్ట్రాల్లో విగ్రహాలకు ఎక్కువ నిధులు కేటాయించిన కేంద్రం రాజధానికి కొంత మాత్రమే నిధులు కేటాయించడం ఎంత వరకు సమంజం?