Begin typing your search above and press return to search.

'అప్పుడు మిస్ట‌ర్ పీఎం..ఇప్పుడు మోడీ హ‌యాం!

By:  Tupaki Desk   |   20 July 2018 8:49 AM GMT
అప్పుడు మిస్ట‌ర్ పీఎం..ఇప్పుడు మోడీ హ‌యాం!
X
కూల్ గా క‌నిపిస్తూ.. వివాదాల‌కు దూరంగా ఉంటూ.. త‌న దారిన తాను అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే గుంటూరు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. ఆ మ‌ధ్య‌న లోక్ స‌భ‌లో మాట్లాడుతూ.. మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అంటూ గ‌ద్దింపు స్వ‌రంలో ప‌ల‌క‌టం ఆంధ్రోళ్ల‌కు మ‌స్తు హ్యాపీ చేసింది. ప్ర‌ధానిని ఉద్దేశించి ఆ మాత్రం స్వ‌రం పెంచిన ఎంపీ ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌లేద‌న్న ఆవేద‌నలో ఉన్న వారికి.. గ‌ల్లా గ‌ద్దింపు ముచ్చ‌ట ప‌డేలా చేయ‌ట‌మే కాదు.. ఆ త‌ర్వాత గుంటూరుకు వ‌చ్చిన ఆయ‌న్ను భారీగా స్వాగ‌తం ప‌లికి ఊరేగింపుగా తీసుకెళ్లారు.

మోడీ స‌ర్కారుపై టీడీపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చను పార్టీ త‌ర‌ఫున ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ కు అప్ప‌జెప్పాల‌ని నిర్ణయించారు. వాస్త‌వానికి ఈ స్పీచ్ ను విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి ఇవ్వాల‌నుకున్నారు. అయితే.. అమెరికాలో చ‌దువుకున్న గ‌ల్లా అయితే.. ఇంగ్లిషులో ఇర‌గ‌దీయ‌ట‌మే కాదు.. ఏదైనా మాట్లాడాల్సి వ‌స్తే.. ఫ‌ట్ ఫ‌ట్ లాడించేలా ఇంగిలిపీసులో అద‌ర‌గొట్టేస్తార‌న్న ఉద్దేశంతో పార్టీ వాద‌న‌ను గ‌ల్లా నోటి నుంచి వినిపించాల‌ని కోరారు. దీనికి ఓకే అన్న గ‌ల్లా.. మ‌రోసారి త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు.

13 నిమిషాల స‌మ‌యాన్ని టీడీపీకి కేటాయించిన‌ట్లు చెప్పినా.. దాన్ని అర‌గంట పొడిగించిన త‌ర్వాత‌.. ఇంకా ఎంత టైం కావాల‌న్న స్పీక‌ర్ మాట‌కు ఏమాత్రం త్రోటుపాటుకు గురి కాకుండా మ‌రో అర‌గంట అని చెప్ప‌టం.. అంత‌సేపా అంటే.. అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టిన ఏ పార్టీకి అయినా గంట‌కు పైనే స‌మ‌యం ఇచ్చిన సంప్ర‌దాయం ఉంద‌ని.. కావాలంటే గ‌తాన్ని చూడాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా గ‌తం ఎందుకు.. వ‌ర్త‌మానంలోకి వెళ‌దామ‌న్న స్పీక‌ర్ మాట‌కు.. త‌న‌కు అర‌గంట అవ‌స‌ర‌మ‌ని తేల్చ‌టం.. స్పీక‌ర్ సుమిత్ర కూడా నో అన‌లేక‌పోయారు. గంట‌కు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన వేళ‌.. మీరు ఇప్ప‌టికే గంట మాట్లాడారన్న స్పీక‌ర్ మాట‌కు.. నో.. ఇంకా గంట కాలేద‌ని చెబుతూ.. ప‌ద‌కొండు త‌ర్వాత స్టార్ట్ చేశాన‌ని.. ప‌న్నెండు ఇంకా అవ్వ‌లేద‌ని చెప్పి త‌న‌ను మాట్లాడ‌నీయ‌కుండా అడ్డు ప‌డ‌లేర‌న్న‌ట్లుగా ఆయ‌న మాట్లాడారు.

త‌న ప్ర‌సంగంలో.. నాటి మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అనే మాట‌కు త‌గ్గ‌ట్లు.. ఈసారి మోడీ పాల‌న అంటూ ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. ఒక్క ప్ర‌ధాని మోడీనే కాదు.. కేంద్ర ఆర్థిక‌మంత్రి పేరును.. ఆయ‌న ప్ర‌స్తావించారు. అంద‌రికంటే ఎక్కువ‌గా మోడీ రిజీమ్ అంటూఆయ‌న ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌టం బీజేపీ వ‌ర్గాల‌కు కాస్తంత అస‌హ‌నానికి గురి చేసింద‌ని చెప్పాలి.

మోడీ ఎదురుగా.. మోడీ పాల‌న‌లో మాకెంత అన్యాయ‌మో తెలుసా? అంటూ గుక్క తిప్పుకోకుండా ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధించ‌టం.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా ఆవేశాన్ని రంగ‌రించ‌టం.. ఎక్క‌డ మాట‌ను రెండు సార్లు చెప్పాలో.. అక్క‌డ రెండు సార్లు ఉచ్చ‌రించ‌టం.. త‌న ప‌దునైన ప‌ద‌జాలంతో పాటు.. పేప‌ర్ల‌ను స‌ర్దుకునే స‌మ‌యంలో.. దానికి స‌భ్యులు చిరాకు ప‌డ‌కుండా ఉండేందుకు..ఏదో చిన్న మాట‌ల్ని మాట్లాడ‌టం.. కొన్నిసంద‌ర్భాల్లో సారీ చెప్ప‌టం లాంటి చేస్తూ.. ఎక్క‌డా త‌గ్గ‌కుండా.. మోడీని.. మోడీ హామీల్ని.. మోడీ పాల‌న‌ను తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగం ఐదు కోట్ల ఆంధ్రోళ్ల ఆగ్ర‌హాన్ని ప్ర‌తిధ్వ‌నించేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రే.. టీడీపీ నేతకు అయినా ఈ ప్ర‌సంగ పాఠాన్ని ఇచ్చి ఉంటే.. ఇంత ఎఫెక్ట్ మాత్రం వ‌చ్చేది కాదు.