వైసీపీపై అంత అక్కసెందుకు గల్లా!

Sun Aug 27 2017 14:57:56 GMT+0530 (IST)

గల్లా జయదేవ్. గుంటూరు టీడీపీ ఎంపీగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా ఆయన వైసీపీపై పరోక్షంగా దాడి చేశారు.  వైసీపీ ఏదో కావాలని ప్రిన్స్ మహేష్ మద్దతు కోరుతోందని - దొంగదారిలో ఆయన పేరును వాడుకుంటోందని అనే రేంజ్ లో కామెంట్లు చేశారు గల్లా. నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడిన గల్లా.. ప్రిన్స్ మహేష్ అందరివాడని చెప్పారు. ఆయన ఏ పార్టీకీ మద్దతివ్వడని పేర్కొంటూనే.. 2014లో జరిగిన ఉదంతాన్ని వెల్లడించారు. అప్పట్లో కూడా తనకు బావ నేపథ్యంలోనే మద్దతిచ్చాడని కానీ టీడీపీకి మద్దతివ్వలేదని గల్లా విషయం బయటపెట్టారు.ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్ లో వైసీపీ నేతలు మహిష్ పేరునే వాడేసుకుంటున్నారని ఇది అన్యాయమనే రేంజ్ లో విమర్శలు గుప్పించారు గల్లా. అయితే వాస్తవానికి మహేష్ పేరును నేరుగా వైసీపీ ఎక్కడా వాడలేదనే విషయాన్ని గల్లా ఎందుకు గుర్తించలేకపోతున్నారో అర్ధం కావడం లేదు. మహేష్ బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీలో కీలక స్థానంలో ఉన్నారు. పార్టీ కోసం... ఆదిశేషగిరిరావే.. స్వయంగా మహేష్ పేరును తెరమీదకి తెచ్చారు. వాస్తవానికి ఈ విషయంలో జగన్ వద్దనే చెబుతున్నట్టు లోటస్ పాండ్ వర్గాలు ఎప్పటి నుంచో వెల్లడిస్తున్నాయి.

2014లోనూ మహేష్ తటస్థంగానే ఉన్నారని కాబట్టి ఆయనను అనవసరంగా మనం ఓన్ చేసుకోవడం మంచిది కాదని జగన్ ఎప్పటి నుంచో తన కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మనకు రోజా లాంటి వాళ్లు ఉన్నారు కదా అని కూడా జగన్ పలు సందర్భల్లో చెప్పుకొచ్చినట్టు లోటస్ పాండ్ వర్గాల కథనం. అయినా కూడా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాత్రం.. పార్టీపై ఉన్న అభిమానంతో.. తన అన్నకుమారుడిగా మహేష్ మద్దతు కోరడాన్ని జగన్ తప్పుపట్టలేకపోయారు అంతే. దీంతో స్వయంగా ఆదిశేషగిరిరావే.. నంద్యాలలో మహేష్ ఫ్యాన్స్ తో భేటీ అయి వాళ్లను ఒప్పించారు.

ఇలాంటి తెరవెనుక వాస్తవాలను గ్రహించకుండా ఎంపీ గల్లా నోటికి ఇష్టం వచ్చినట్టు వైసీపీపై ఉన్న అక్కసుతో ఇలా మహేష్ బాబు ఫొటోను - మద్దతును వాడుకుంటున్నారని అనడంపై వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.  ఎవరి సాయం లేకుండానే జగన్.. 67 మంది ఎమ్మెల్యేలతో భారీ విపక్షంగా ఎదిగారన్న విషయాన్ని గుర్తించాలని పవన్ - మోదీల అండ సహా అడ్డమైన హామీలతో బాబు సాధించింది కూడా జనాలకి తెలుసునని వారు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మరి గల్లా ఏం చెబుతారో చూడాలి.