ఇందుకేనా.. రాజకీయాలకు గాలి గుడ్ బై?

Fri Apr 21 2017 11:09:26 GMT+0530 (IST)

గాలి జనార్దన్ రెడ్డి పేరు విన్నంతనే.. రాజకీయ నాయకుడిగా.. ఆక్రమ గనుల తవ్వకాల కేసుల్ని ఎదుర్కొన్న అపర కుబేరుడు గుర్తుకు వస్తాడు.

 ఒకప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రబల శక్తిగా అవతరించటమే కాదు.. ఆయన కనుసన్నల్లోనే ప్రభుత్వాలు నడిచేవన్న పేరుంది. అలాంటి గాలి మెడకు కేసుల ఉచ్చు పడటమేకాదు.. నెలల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. రాజకీయాల్లో ఉంటూ తాను చేసిన వ్యాపారాలకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందన్న భావనను గాలి వ్యక్తం చేస్తుంటారు. తానుకానీ రాజకీయాల్లో ఉండి ఉండకపోతే..కేసులు.. జైలు రచ్చ ఉండనే ఉండదన్న ఫీలింగ్ లో ఉంటారు.

ఈ మధ్యనే కూతురి పెళ్లి చేసిన గాలి.. ఆ సందర్భంలోనూ కేసుల బెడద తప్పలేదు. ఈ ఉదంతంతో గాలి తీవ్రంగా విసిగిపోయారని.. ఫ్యూచర్ రాజకీయాల విషయంలో ఫస్ట్రేషన్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. రాజకీయాల్లో ఉండే కేసులు.. జైలు లాంటివి తప్పవని.. ఆ లొల్లి కంటే.. రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదన్న భావనకు ఆయన వచ్చినట్లుగా చెబుతున్నారు.

మరికొద్ది నెల్లలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ ఎన్నికల్లో ఆయన పోటీకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బళ్లారి.. రాయచూరు జిల్లాల్లో పార్టీ గెలుపు కోసం గాలి ప్రయత్నాలు షురూ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వాదనకు భిన్నంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని గాలి భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

బీజేపీలోనే కొనసాగుతూనే.. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలో గాలి ఉన్నట్లుగా తెలుస్తోంది. కావాలంటే.. పార్టీ తరఫున ప్రచారం చేయటం వరకూ ఓకేకానీ.. ఎన్నికల బరిలో నిలిచేందుకు మాత్రం తానుసిద్దంగా లేనట్లు తనసన్నిహితుల వద్ద గాలి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి ఉన్న కేసులు చాలని.. ఎన్నికల్లో నిలబడి.. మరిన్ని కేసులు మూటగట్టుకునే కన్నా.. ప్రత్యక్ష రాజకీయాలకుదూరంగా ఉండటం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. పవర్ తనకేం కొత్తకాదని.. అధికారానికి ఎంత దగ్గరగా ఉండాలో అంత ఉన్నానని.. తాను చూడాల్సినవేమీ లేవని.. రాజకీయాలకు దూరంగా ఉంటూ.. తన మానాన తాను ఉండాలన్నభావనలో గాలి ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. ఆయన ఆ ఆలోచనలో ఉంటే..కర్ణాటక బీజేపీకి ఎంతోకొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/