డబ్బున్ననేతకు గాలికి మధ్య కర్ణాటక సవాల్

Thu May 17 2018 16:33:30 GMT+0530 (IST)

కన్నడ రాజకీయం హాట్ హాట్‌గా మారుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కాదని అనూహ్య రీతిలో బీజేపీ నేత యడ్యురప్పకు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశం ఇవ్వడం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ కాంగ్రెస్‌కు ఫలితం దక్కకపోవడం తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీపై రగిలిపోతోంది. బీజేపీ తీరుకు నిరసనగా విధాన సౌధ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత - ఎంపీ గులాం నబీ ఆజాద్ తో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ...యడ్యూరప్పతో గవర్నర్ ప్రమాణం చేయించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెడతామన్నారు.ఇలా ఓవైపు దూకుడుగా స్పందిస్తూనే మరోవైపు...రాజకీయంగా కాంగ్రెస్ చక్రం తిప్పుతోంది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర్య ఎమ్మెల్యేలను తన గూటికి చేర్చుకుంది. దీంతో బీజేపీ అవాక్కయింది. అయితే అదే సమయంలో క్యాంప్ రాజకీయాలను సైతం కాంగ్రెస్ పార్టీ బీజేపీలు జోరుగా నడిపిస్తున్నాయి. తమ టీంలో ఉన్న ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు క్యాంప్ లకు తరలిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు చెందిన క్యాంప్ రాజకీయాలకు నాయకత్వం వహిస్తోంది ఇద్దరు ప్రముఖ నేతలు కావడం కన్నడ రాజకీయం మరింత హీటెక్కిస్తోంది. ఆ ఇద్దరే మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి. మాజీ మంత్రి డీకే శివకుమార్.

గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ శిబిరాన్ని `సమన్వయం` చేస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజేపీ ఎమ్మెల్యేల క్యాంప్‌కు సంబంధించి తెరవెనుక ఉండి `అన్నీ` చక్కదిద్దుతోంది గాలి జనార్దన్ రెడ్డి - ఆయన సోదరులేనని సాక్షాత్తు కమళనాథుల్లోనే చర్చ జరుగుతోంది. ఇక తృటిలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని రిసార్ట్‌లకు తరలించింది. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా అన్ని జాగత్రలు తీసుకుంటోంది. ఈ క్యాంప్ మాజీ మంత్రి డీకే శివకుమార్ కనుసన్నల్లో సాగుతోంది. దేశంలోనే అత్యంత ధనికుడైన ప్రజాప్రతినిధిగా పేరొందిన శివకుమార్ కాంగ్రెస్ క్యాంప్‌నకు చెందిన ఎమ్మెల్యేలకు ``తగిన ఏర్పాట్లు`` చేస్తున్నట్లు చెప్తున్నారు. తన అఫిడవిట్లోనే రూ.730 కోట్ల ఆస్తులను చూపించిన శివకుమార్ తద్వారా ఆర్థికంగా  బలమైన నాయకుడిగా గుర్తింపును పొందారు. అలాంటి నాయకుడు ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంప్ ను లీడ్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ - బీజేపీ పరస్పర ఎత్తుగడల కంటే గాలి జనార్దన్ రెడ్డి - డీకే శివకుమార్ ఎత్తుగడల గురించే ఎక్కవ చర్చ జరుగుతుండటం గమనార్హం.