భాజపా గెలుపు కోసం- గాలి ‘అదృశ్య’ సాయం

Thu Feb 22 2018 18:23:02 GMT+0530 (IST)

మైనింగ్ కేసుల్లో నిందితుడిగా అరెస్టు అయి.. ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్న గాలి జనార్దనరెడ్డి కోర్టు తీర్పు ప్రకారం బళ్లారి లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అయితే.. బళ్లారి సరిహద్దు గీతకు అవతల చిత్రదుర్గ పరిధిలో ఓ గొప్ప ఫాంహౌస్ లో కొలువుతీరి బళ్లారి రాజకీయాలను మొత్తం అదృశ్య శక్తి లాగా నడిపించదలచుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ప్రస్తుతం అదే జరుగుతోంది.కోర్టు నిబంధనల నేపథ్యంలో గాలి జనార్దనరెడ్డి కుటుంబం ప్రస్తుతం బెంగుళూరులోనే నివాసం ఉంటున్నారు. నిజానికి ఆయనకు తమ పార్టీతో ప్రస్తుతం సంబంధం లేదని ఆయన ఇప్పుడు తమ  పార్టీలో సభ్యుడు కూడా కాదని.. భారతీయ జనతా  పార్టీ గతంలోనే ప్రకటించింది. ఆ ప్రకటన కేవలం ప్రజల ముందు నిజాయితీ ఇమేజి కోసమే తప్ప.. చాటుమాటుగా తెరవెనుక నుంచి ‘అన్ని రకాలుగానూ’ ఆయన సాయం తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఉత్సాహపడుతున్నట్లుగా కన్నడ సీమలో పుకార్లు వినిపిస్తున్నాయి.

ఆ మేరకు తన శక్తి వంచన లేకుండా భాజపా విజయానికి కృషి చేయడానికి గాలి జనార్దనరెడ్డి కూడా సిద్ధంగానే ఉన్నారు. ఒక ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. ఆయన ఇప్పటికే రంగంలోకి దిగారు. బెంగుళూరు నగర శివార్లలోని ఒక ఫాం హౌస్ లో ఆయన తన మద్దతు దారులతో గురువారం ఒక రహస్య సమావేశం ఏర్పాటుచేసి సుదీర్ఘంగా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 300 మంది వరకు గాలికి పాత అనుచరులుగా మెలిగిన ప్రముఖులు ఈ భేటీకి హాజరైనట్లుగా చెప్పుకుంటున్నారు.

గాలి జనార్దన రెడ్డికి బళ్లారి ప్రాంతంలో బాగానే పట్టుంది. దాంతో పాటు ఉత్తర కర్ణాటక లోని పలుజిల్లాల్లో కూడా గాలి మాట చెల్లుబాటు అవుతుందనేది అంచనా. గాలి జనార్దనరెడ్డినుంచి పరోక్షంగా సాయం తీసుకుని ఆయా ప్రాంతాల్లో లబ్ధిపొందాలనేది భాజపా వ్యూహంగా ఉన్నట్లు చెబుతున్నారు.

అందుకు గాలికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారు. ఆయన మైనింగ్ కేసు్ల్లో అరెస్టు అయిన తర్వాత... అప్పటి యూపీఏ ప్రభుత్వం తనను కావాలనే కేసుల్లో ఇరికించిందని అనేకమార్లు ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. చాలాకాలం జైల్లో గడిపారు. అలాంటప్పుడు రాష్ట్రంలో అధికారం మారి.. కమలవికాసం జరిగితే చాలు.. నెమ్మదిగా తాను పూర్వస్థాయిలో చక్రం తిప్పే రేంజికి చేరుకోవచ్చునని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే రాజకీయ బరిలోకి ఆయన డైరక్ట్ ఎంట్రీ ఉండకపోవచ్చుననే అందరూ అనుకుంటున్నారు. భాజపా కూడా అందుకు సిద్ధంగా లేదు. తెరవెనుకనుంచే మొత్తం చక్రం తిప్పడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు.