Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు షాకిస్తున్న సీనియర్ లీడర్

By:  Tupaki Desk   |   28 April 2016 7:47 AM GMT
కాంగ్రెస్ కు షాకిస్తున్న సీనియర్ లీడర్
X
వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ప్రవాహంలా వచ్చి చేరిపోతున్నారు. అయితే... కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం టీడీపీలోకి చేరికలు కనిపించడంలేదు. చంద్రబాబు పూర్తిగా ఎమ్మెల్యేల చేరికలపైనే దృష్టిపెట్టడమే దీనికి కారణం. దీంతో కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు కొందరు టీడీపీలోకి రావాలని ఆసక్తిగా ఉన్నా టీడీపీ నుంచి ఆసక్తి కనిపించడంలేదు. ఇందుకు సీనియర్ లీడర్ గాదె వెంకటరెడ్డే ఉదాహరణ. చాలాకాలంగా ఆయన చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు పిలిస్తే టీడీపీలో చేరిపోతాననీ అంటున్నారు. అయితే... చంద్రబాబు నుంచి స్పందన లేదు.

దీంతో మరోమారు సంప్రదించిన గాదెకు తాజాగా చంద్రబాబు ఓకే చెప్పారట. దీంతో ఆయన ఇప్పుడు మరోసారి ప్రకటన చేశారు. తాను విజయవాడ వెళ్లి చంద్రబాబును కలుస్తానని... టీడీపీలో చేరుతానని మీడియా వద్ద ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. చంద్రబాబు పాలనను మెచ్చుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని గాదె అన్నారు. రేపు విజయవాడకు వెళ్లి చంద్రబాబును కలుస్తానని.. చంద్రబాబు సమక్షంలోనే తాను టీడీపీలో చేరతానని కూడా గాదె వెంకటరెడ్డి ప్రకటించారు.

విభజన తరువాత కాంగ్రెస్ కుదేలవడంతో రెండున్నరేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు గాదె దూరంగా ఉన్నారు. రెండు - మూడు రోజుల క్రితం తిరిగి యాక్టివేట్ అయిన గాదె... టీడీపీలో చేరేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మంచి ముహూర్తం కోసం వేచి చూశారు. రేపు సుముహూర్తం ఉందని భావించిన గాదె కొద్దిసేపటి క్రితం గుంటూరులో మీడియా ముందుకు వచ్చారు. రేపు ఆయన అధికారికంగా టీడీపీలో చేరనున్నారు.

కాంగ్రెస్ నుంచి టీడీపీలో మొదట్లోనే చేరిపోయిన సీనియర్లకు మంచి ప్రాధాన్యమే దక్కుతోంది. రాయపాటి - జేసీ వంటివారికి టీడీపీలో ప్రస్తుతం బాగానే ఉంది. ఆ తరువాత చేరిన ఆనం బ్రదర్సు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. దీంతో వారిని చూసి మిగతా కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.