Begin typing your search above and press return to search.

దేవినేని నెహ్రూ చేరిక వెనుక చక్రం తిప్పిందెవరు?

By:  Tupaki Desk   |   30 Aug 2016 9:38 AM GMT
దేవినేని నెహ్రూ చేరిక వెనుక చక్రం తిప్పిందెవరు?
X
కొద్దికాలంగా విజయవాడ రాజకీయాల్లో పలు ఊహాగానాలకు తెరలేపిన దేవినేని నెహ్రూ పార్టీ మారే వ్యవహారం కొలిక్కి వచ్చింది. గతంలో వైసీపీకి వెళ్తారని భావించిన నెహ్రూ ఆ తరువాత చంద్రబాబుతో భేటీ అయినా వెంటనే చేరికకు ఏర్పాట్లు జరగలేదు. తాజాగా మరోసారి భేటీ అయిన తరువాత ఈ నెల 12న నెహ్రూ టీడీపీలో చేరడానికి ముహూర్తం కుదిరింది. అయితే.. దేవినేని నెహ్రూను టీడీపీలోకి తేవడం వెనుక ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేత కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. టీడీపీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు చక్రం తిప్పారని చెబుతున్నారు.

నిజానికి బాబూరావు చాలాకాలంగా రాష్ట్రస్థాయి రాజకీయాల్లో చురుగ్గా లేరు. ఆయన మీడియా ముందుకొచ్చి కూడా చాలాకాలమైంది. కానీ... నెహ్రూను పార్టీలోకి తేవడంలో మాత్రం ఆయన కీలక పాత్ర పోషించారు. నెహ్రూతో ఆయనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండడం... బాబూరావు మాటలకు నెహ్రూ విలువవ్వడం వంటి కారణాలతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకటరావు తెలివిగా గద్దె బాబూరావును ప్రయోగించి నెహ్రూను షరతులేవీ లేకుండా టీడీపీలోకి తెచ్చారని చెబుతున్నారు.

కాగా రాజధాని ప్రాంతంలో వేరే పార్టీలకు బలపడే అవకాశం ఏమాత్రం ఇవ్వరాదని టీడీపీ గట్టిగా అనుకుంటున్న తరుణంలోనే నెహ్రూను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడలో మంచి హోల్డు ఉన్న నెహ్రూ టీడీపీలోకి రావడం ప్రయోజనకరమని చంద్రబాబు భావించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాబూరావు రంగంలోకి దిగి వ్యవహారాన్ని చక్కబెట్టినట్లు చెబుతున్నారు. కాగా ఈరోజు చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన తరువాత నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ తన చేరిక విషయాన్ని ప్రకటించారు. తనకు తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ కాదని, పార్టీ ఆవిర్భావంలో జెండాకు రూపకల్పన చేసే సమయం నుంచే తనకు భాగస్వామ్యం ఉందని చెప్పారు.