Begin typing your search above and press return to search.

గ‌జ్వేల్ నుంచే గద్ద‌ర్‌..కేసీఆర్‌ కు ప్ల‌స్సా - మైన‌స్సా

By:  Tupaki Desk   |   8 Nov 2018 11:07 AM GMT
గ‌జ్వేల్ నుంచే గద్ద‌ర్‌..కేసీఆర్‌ కు ప్ల‌స్సా - మైన‌స్సా
X
తెలంగాణ‌లో కేసీఆర్ శ‌త్రువులు - ఆయ‌న‌ను వ్య‌తిరేకించే వారు ఆయ‌న‌కే ప‌రోక్షంగా స‌హాయం చేస్తున్నారా? కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తే అలాగే అనిపిస్తుంది. ప్ర‌స్తుతం కేసీఆర్ మెద‌క్ జిల్లాలోని త‌న పాత నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, గ‌తంలో ఇక్క‌డ కేసీఆర్ కు వ‌చ్చిన మెజారిటీ స్వ‌ల్ప‌మే. అనుకోని రీతిలో మ‌హాకూట‌మి ఏర్పాటుకావ‌డం - గ‌తంలో పోటీచేసిన‌ టీడీపీ అభ్యర్థి వంటేరు ప్ర‌తాప్‌ రెడ్డి ఇపుడు కాంగ్రెస్ నుంచి పోటీలో దిగుతాను అని ప్ర‌క‌టించ‌డం... ఆ రెండు పార్టీలు క‌ల‌వ‌డంతో కేసీఆర్‌ కు క‌ల‌వ‌రంగా ఉంది. ఎందుకంటే... ఆ రెండు పార్టీల‌కు గత ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్లు క‌లిపితే కేసీఆర్‌కు వ‌చ్చిన ఓట్ల కంటే ఎక్కువ‌. అయితే, ఇక్క‌డ ఓ ట్విస్ట్ ఉంది.

ఇటీవ‌లే తాను ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌కటించిన ప్రజా గాయకుడు గ‌ద్ద‌ర్ కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీని క‌లిశారు. దీంతో అస‌లు గ‌ద్ద‌ర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా? అన్న కొత్త అనుమానాలు మొద‌ల‌య్యాయి. అయితే, ఈరోజు తాజాగా గ‌ద్ద‌ర్ ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్టు గద్దర్ స్ప‌ష్టం చేశారు. ఈరోజు గ‌ద్ద‌ర్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ - తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని చెప్పారు. మొన్న సోనియాగాంధీ - రాహుల్ గాంధీలను కలిసినప్పుడు 45 నిమిషాల పాటు వారికి పాటలు పాడి వినిపించానని తెలిపారు. అలాగే 'సేవ్ కాన్స్టిట్యూషన్ - సేవ్ డెమొక్రసీ' పుస్తకం గురించి వివరించిన‌ట్లు చెప్పారు.

ఇపుడు ఉద‌యిస్తున్న కొత్త‌ప్ర‌శ్న ఏంటంటే... అస‌లు కేసీఆర్ గ‌ద్ద‌ర్ వెనుక ఉన్నారా అన్న అనుమానం క‌లిగే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే... ముగ్గురు బ‌ల‌మైన అభ్య‌ర్థులు పోటీచేసిన‌పుడు కేసీఆర్‌ కు క‌చ్చితంగా అది ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ త‌ర‌ఫున వంటేరు ప్ర‌తాప్‌ రెడ్డి పోటీ చేసి, గ‌ద్ద‌ర్ కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే క‌చ్చితంగా కేసీఆర్ విజ‌యం సాధించ‌డం త‌థ్యం. ఈ నేప‌థ్యంలో మ‌హాకూట‌మికి కూడా ఇది క‌ల‌వ‌రానికి గురిచేసే పాయింటే. కేసీఆర్‌కు మాత్రం పెద్ద రిలీఫ్‌. అయితే, ఒక‌వేళ మొన్న రాహుల్ స‌మావేశంలో గ‌ద్దర్ కోసం ఆ సీటును కాంగ్రెస్ వ‌దిలేసుకుని... అక్క‌డ ఎవ‌రినీ పోటీ పెట్ట‌కుంటే మాత్రం అపుడు గ‌ద్ద‌ర్ - కేసీఆర్ మ‌ధ్య హోరాహోరీ ఉంటుంది. అయితే, దీనికి వంటేరు, న‌ర్సారెడ్డి ఒప్పుకుంటారా? అన్న‌ది ఒక పెద్ద ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే వంటేరు చాలా ఖ‌ర్చుపెట్టుకున్నారు. చివ‌రి నిమిషంలో పోటీ నుంచి త‌ప్పుకోమంటే అత‌ని స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న‌ది వేచిచూడాలి. వీట‌న్నింటి నేప‌థ్యంలో ఇపుడు గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం తెలంగాణ‌లోనే హాట్ టాపిక‌గ్ గా మారింది.

ఇక మీడియా స‌మావేశంలో గ‌ద్ద‌ర్ మాట్లాడుతూ తన ప్రచారంలో భాగంగా... తొలి దశలో ఎస్టీ, రెండో దశలో ఎస్సీ, మూడో దశలో బీసీ, నాలుగో దశలో పేద ఓటర్ల వద్దకు వెళ్లి... వారిలో ఓటుపై చైతన్యం కల్పిస్తానని గ‌ద్ద‌ర్ వివ‌రించారు. సాధారణ అవినీతి కంటే రాజకీయ అవినీతి దేశానికి ఎక్కువ న‌ష్టం చేస్తుంద‌ని, అది అత్యంత ప్రమాదకరం అని ఆయన తెలిపారు.