మండిపడుతున్న వైశ్యులపై మాటల మిర్చిపౌడరా?

Wed Sep 13 2017 10:20:39 GMT+0530 (IST)

ఎక్కడ మొదలై ఎక్కడికి వెళుతోంది వైశ్యుల వ్యవహారం అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తానెప్పుడో (2007) ఇంగ్లిషులో రాసిన పుస్తకాన్ని తాజాగా తెలుగులో అచ్చేసిన కంచె ఐలయ్యకు వైశ్యుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన.. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అంటూ ఆ వర్గంపై ఐలయ్య రాసిన పుస్తకంలోని అంశాలపై వైశ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఒక వర్గాన్ని తీవ్రస్థాయిలో తప్పులు ఎత్తి చూపుతున్న వైనాన్ని పలువురు ఖండిస్తుంటే.. ఊహించని రీతిలో ఐలయ్యకు కొందరు పలుకుతున్న మద్దతు ఇప్పుడు షాకింగ్ గా మారిందని చెప్పాలి. కులం.. వర్గం ఏదైనా.. వారిని కించపరిచేలా.. వారి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాట్లాడితే పెద్ద ఎత్తున నిరసనలు చేయటం తెలిసిందే.

కులం.. మతాల్ని వదిలేసినా..ఏదైనా ఒక ప్రముఖుడికి సంబంధించి రెండు మాటలు తేడాగా మాట్లాడితే దానిపై ఆందోళన చేయటాన్ని చూశాం. ఇలా చేసిన వారిని తప్పు పట్టటం.. వారిని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడటం ఇప్పటివరకూ చూసింది లేదు.

తమను చులకన చేస్తూ పుస్తకం రాసిన ఐలయ్య పై వైశ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం ఒక ఎత్తు అయితే.. నిరసనలు  చేస్తున్న వారు మరింత మండిపోయేలా.. రెచ్చగొట్టేలా ఇద్దరు.. ముగ్గురు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడీ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి. ఐలయ్య పుస్తకాన్ని వివాదాస్పదం చేయటం సరికాదంటూ తప్పు పడుతున్నారు గద్దర్. పథకం ప్రకారమే కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయంటూ మరింత మండిపోయేలా మాట్లాడారు.

తమ కులాన్ని.. తమను.. వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా అన్ని విధాలుగా వేలెత్తి చూపటమే కాదు.. సంఘ విద్రోహులని ముద్ర వేసిన తర్వాత కూడా ఎవరు మాత్రం మౌనంగా ఉంటారు? తమ మనోభావాల్ని దెబ్బ తిన్నప్పుడు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేయటం తప్పన్నట్లుగా చెబుతున్న గద్దర్ మరో వివాదాస్పద వ్యాఖ్యను చేశారు. ఐలయ్యపై ఇదే రీతిలో ఆందోళనలు సాగితే.. వైశ్యుల దుకాణాల్లో ఏమీ కొనద్దని పిలుపునిస్తామని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.

ఐలయ్య రాసిన పుస్తకం మీద ఇప్పటికే మండిపడుతున్న వైశ్యులపై.. తన మిర్చిపౌడర్ లాంటి మాటల్ని సంధించటం ఇప్పుడు విస్మయాన్ని రేకెత్తిస్తోంది. భావస్వేచ్ఛ పేరుతో.. ఎవరి మీదైనా.. ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేయటం సరైన పద్ధతేనా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతుంది. తమను తీవ్రస్థాయిలో కించపరుస్తూ పుస్తకం రాసిన ఐలయ్యపై నిరసన వ్యక్తం చేస్తుంటే.. దాన్ని మరింత పెంచేలా షాపుల్లో ఏమీ కొనుగోలు చేయొద్దని పిలుపునిస్తామని గద్దర్ లాంటి వాళ్లు మాట్లాడటం చూస్తే.. అనిపించేది ఒక్కటే.

పేరుకు అగ్రకులంగా అభివర్ణించే వైశ్యులు.. సామాజికంగా అసలుసిసలైన దళితులన్న విషయం ఐలయ్య పుస్తకం.. గద్దర్ మాటల్ని చూస్తే అనిపించక మానదు. వారిని ఏమన్నా.. ఏం చేసినా.. ఏం  చేయలేరన్న ధీమా కావొచ్చు.. సామాజికంగా వారిది బలమైన వర్గం కాకపోవటంతోనే ఈ తరహాలో గద్దర్ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. అవమానభారంతో రగిలిపోతున్న వారిని మరింత రెచ్చగొట్టేలా గద్దర్ తో సహా ఎవరు మాట్లాడినా అది తప్పే అవుతోందనటంలో సందేహం లేదు.