Begin typing your search above and press return to search.

రాజకీయం అంతే; గద్దర్ నోట.. చిరు మాట

By:  Tupaki Desk   |   2 Sep 2015 4:37 AM GMT
రాజకీయం అంతే; గద్దర్ నోట.. చిరు మాట
X
2009 ఎన్నికల ముందు చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి నెలల పాటు.. సస్పెన్స్ సాగింది. తాను రాజకీయాల్లోకి వస్తానన్న విషయం కానీ.. పార్టీ పెట్టే విషయం కానీ నెలల కొద్దీ సస్పెన్స్ సాగించిన చిరును.. ఎవరైనా కలిసి రాజకీయాల్లోకి వస్తారా? అని ప్రశ్నిస్తే.. ప్రజలు కోరుకుంటే వస్తానని నర్మగర్భంగా చెప్పుకొచ్చేవారు.

మనసులో రాజకీయాల్లోకి రావాలని ఉన్నా.. అందుకు తగ్గ ప్రయత్నాలు ఓ పక్క చేస్తూనే.. అమాయకంగా మాట్లాడిన చిరును చూసి అప్పట్లో రాజకీయం బాగానే నేర్చాడే అని అనుకన్న వారున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా నాటి చిరు మాటల్ని మరపించేలా ప్రజా ఉద్యమనాయకుడు గద్దర్ మాటలు ఉండటం విశేషం. త్వరలో జరిగే వరంగల్ ఎంపీ స్థానానికి జరిగే ఉఫ ఎన్నికల బరిలోకి గద్దర్ రానున్నారన్న వార్తలు ఒక్కసారిగా ఆసక్తిని రేకెత్తించాయి.

ఇదే సమయంలో గద్దర్ స్పందించి.. తన రాజకీయ ప్రవేశం గురించి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఎన్నికల రాజకీయాల పట్ల ఆయనెంత ఆసక్తిగా ఉన్నారన్న విషయం చెప్పకనే చెప్పినట్లుగా చెప్పొచ్చు. వరంగల్ బరిలోకి దిగాలని లెఫ్ట్ నేతలు తనను సంప్రదించారని.. ప్రజలు కోరుకుంటే.. తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెప్పుకొచ్చారు. తన రాజకీయరంగ ప్రవేశాన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు.

ఓపక్క వామపక్ష నేతలు గద్దర్ ను వరంగల్ ఉప ఎన్నికల బరిలో నిలపాలన్న నిర్ణయం తీసుకొని.. ఆ దిశగా గద్దర్ ను ఒప్పించేందుకు కిందామీదా పడుతున్నారు. మరోవైపు గద్దర్ కూడా బరిలోకి దిగేందుకు సముఖంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. అప్పట్లో చిరంజీవి చెప్పిన తీరులోనే.. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని చెబుతుంటే.. ఉద్యమ నేత కంటే కూడా రాజకీయ నేత లక్షణాలు గద్దర్ లో కనిపిస్తున్నాయన్న వ్యాఖ్య వినిపిస్తోంది.