Begin typing your search above and press return to search.

బీజేపీ తెలుగు ఎంపీకి ఎన్నారై టీడీపీ స‌భ్యుల సెగ‌!

By:  Tupaki Desk   |   17 May 2018 11:10 AM GMT
బీజేపీ తెలుగు ఎంపీకి ఎన్నారై టీడీపీ స‌భ్యుల సెగ‌!
X
కొద్ది రోజుల క్రితం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో న‌టుడు శివాజీకి బీజేపీ కార్య‌క‌ర్త‌ల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. అదే విమానాశ్ర‌యంలో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఉన్న సంద‌ర్భంలోనే శివాజీని కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. తాజాగా, అదే త‌ర‌హాలో అమెరికాలోని న్యూజెర్సీలో ఓఎఫ్ బీజేపీ వారు ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ బీజేపీ రాజ్యస‌భ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావుకు ఏపీ ఎన్నారైల నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీంతో, ఈ నిర‌స‌న‌పై న‌ర‌సింహారావు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. దానితో పాటు ఏపీకి మోదీ చేసిన మేలుపై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ఎన్నారై టీడీపీ మిత్రుల‌కు స‌వాల్ విసురుతూ ఓ వీడియోను పెట్టారు. చ‌ర్చ‌ల‌తో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుందాన్నారు.

త‌న‌ ప్ర‌సంగాన్ని ఎన్నారై టీడీపీ మిత్రులు ర‌భ‌స చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న ఆరోపించారు. వార‌డిగిన ప్ర‌శ్న‌ల‌కు తాను స‌మాధానం చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ కూడా వారు విన‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న ప్ర‌సంగాన్ని ప‌దే ప‌దే అడ్డుకున్నార‌ని ఆరోపించారు. మ‌న‌మంతా భార‌తీయుల‌మ‌ని, స్వ‌దేశానికి దూరంగా ఇక్కడ నివ‌సిస్తున్నామ‌ని అన్నారు. ఏవైనా స‌మ‌స్య‌లుంటే చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకుకోవాల‌ని, ఈ ర‌కంగా ర‌భ‌స‌ - గ‌లాటా చేయ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని అన్నారు. టీడీపీఎన్నారై మిత్రులు అడిగే ప్ర‌తి ప్ర‌శ్న‌కు హేతుబ‌ద్ధంగా స‌మాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. తాను ఇంకా నాలుగు రోజుల పాటు అమెరికాలో ఉంటాన‌ని, ఏ ప్రాంతంలోనైనా, ఏ స‌మ‌యంలోనైనా ఎన్నారై టీడీపీ మిత్రులు స‌మావేశం ఏర్పాటు చేస్తే త‌నంత‌ట తానే వ‌చ్చి మాట్లాడ‌తాన‌ని ఆయ‌న అన్నారు. చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుందామ‌ని, గొడ‌వ‌లు ప‌డ‌డం వ‌ల్ల లాభం లేద‌ని అన్నారు. ఏపీ ప‌ట్ల న‌రేంద్ర మోదీ గారి చిత్త‌శుద్ధిని వారికి వివ‌రించి ఒప్పించ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం తన‌కుంద‌ని అన్నారు. వినే ఓపిక‌ - శ్ర‌ద్ధ ఎన్నారై టీడీపీ మిత్రుల‌కుంటే ఓఎఫ్ బీజేపీ ద్వారా త‌న‌కు తెలియ‌జేయాల‌ని కోరారు. ``చంద్ర‌బాబుగారు....ఎన్నారై టీడీపీ మిత్రులు కొంద‌రు మా కార్య‌క్ర‌మాన్ని అడ్డుకున్నారు. బ‌హుశా మీ సందేశాలు...ఆదేశాల ప్ర‌కారం వారు అలా చేసి ఉంటారు. ఇటువంటి చిల్ల‌ర నాట‌కాలు ఆపి పాల‌నపై దృష్టి పెట్టండి`` అని ట్వీట్ చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి