Begin typing your search above and press return to search.

బాబును చిత్తు చిత్తుగా ఓడించ‌టం ఖాయ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   14 Jun 2018 5:48 AM GMT
బాబును చిత్తు చిత్తుగా ఓడించ‌టం ఖాయ‌మ‌ట‌!
X
రాజ‌కీయాల‌న్నాక జోస్యం చెప్ప‌కుండా ఎలా కుదురుతుంది చెప్పండి. కాకుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి నూట ప‌ది స్థానాలు మావే లాంటి బ‌డాయి జోస్యాల జోలికి వెళ్ల‌కుండా.. ఉన్నంత‌లో వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా మాట్లాడే తీరు ఇప్పుడున్న దూకుడు రాజ‌కీయాల్లో త‌క్కువ‌గా క‌నిపిస్తారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌జ‌ల‌కు పార్టీ ఎంత చేటు చేస్తున్నా..కిమ్మ‌న‌కుండా ఉండ‌టం కొద్ది మందికే ద‌క్కుతుంది.

అలాంటి తీరు ట‌న్నులు ట‌న్నులుగా ఏపీ నేత‌ల్లో క‌నిపిస్తుంటుంది. మ‌రే రాష్ట్రంలోనూ ఈ త‌ర‌హా క‌నిపించ‌దు. సొంత రాష్ట్రానికి న‌ష్టం జ‌రుగుతున్నా కిమ్మ‌న‌కుండా ఉండ‌టం ఏపీ నేత‌ల్లో క‌నిపించినంత ఎక్కువ‌గా మ‌రెక్క‌డా క‌నిపించ‌దు. ఈ కార‌ణంతోనే రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ ఏ రాజ‌కీయ పార్టీ నేత‌లు కూడా ఏపీ ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయే అంశం మీద మాట్లాడింది క‌నిపించ‌దు. ఉద్య‌మించిన‌ట్లు క‌నిపించ‌దు.

విభ‌జ‌న న‌ష్టం త‌ర్వాత కూడా ఏపీ నేత‌ల్లో మార్పు రాలేదు. ఏపీకి ఇస్తాన‌న్న ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయం గురించి తెలిసి కూడా మాట్లాడ‌ని తీరు ఏపీ క‌మ‌ల‌నాథుల్లో క‌నిపిస్తుంటుంది. ఏపీకి చెందిన వారై ఉండి.. పార్టీలో అంతో ఇంతో ప‌లుకుబ‌డి సంపాదించిన త‌ర్వాత కూడా సొంత రాష్ట్రానికి చేటు చేస్తుంటే కిమ్మ‌న‌కుండా ఉండ‌టం ఏపీ బీజేపీ నేత‌ల‌కు ఇప్పుడో అల‌వాటుగా మారింది.

అదే స‌మ‌యంలో త‌మ‌తో క‌టీఫ్ చెప్పిన ఏపీ అధికార‌ప‌క్షంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త‌మ ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌టం.. త‌మ అరాధ్య దైవం మోడీని బంకేసి బాదిన‌ట్లుగా బాదేస్తున్న బాబు తీరుపై గుర్రుగా ఉన్న వారు ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్ల‌ను విమ‌ర్శ‌ల‌తో చిత‌క్కొట్టేస్తున్నారు.

తాజాగా ఇదే విష‌యాన్ని మ‌రింత సీరియ‌స్ గా చెప్పారు బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహారావు. గ‌తంలో ఏపీ విష‌యాల్ని వారానికి.. రెండు వారాల‌కు కూడా మాట్లాడ‌ని స్థానే.. ఇప్పుడు డైలీ బేసిస్ లో బాబుపై విరుచుకుప‌డుతున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌మ‌కేమీ చేయ‌టం లేద‌ని ఏపీ ప్ర‌జ‌లు తెలుసుకున్నార‌ని.. 10 నెల‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో బాబు చిత్తు చిత్తుగా ఓడిపోవ‌టం ఖాయ‌మ‌ని తేల్చి చెబుతున్నారు.

సీఎం ప‌ద‌విని అడ్డం పెట్టుకొని ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్న‌ట్లు చెప్పిన వారు.. కేంద్రంతో ప‌ని చేయించాల్సింది పోయి సీఎం త‌మ‌ను ప్ర‌శ్నిస్తున్నార‌న్నారు. టీడీపీ నేత‌లు వీధుల్లో ప్ర‌చార‌మే త‌ప్పించి వేరే ప‌నులు చేయ‌టం లేద‌న్న జీవీఎల్ మాట‌ల్లో నిజాయితీ ఏమిటంటే.. బాబు ఓడిపోతార‌ని చెబుతున్నారే కానీ.. తాము గెలుస్తామ‌న్న ధీమాను అస్స‌లు వ్య‌క్తం చేయ‌క‌పోవ‌టం.శ‌భాష్ జీవీఎల్ రాజ‌కీయాల్లో ఆ మాత్రం నిజాయితీగా ఉండ‌టం అవ‌స‌ర‌మే.