జీవీఎల్!... మోదీ స్పీచ్ ను చంపేశారండీ!

Mon Feb 11 2019 09:45:46 GMT+0530 (IST)

ప్రధాని నరేంద్ర మోదీ టూర్ లో బొచ్చెడన్ని ప్రత్యేకతలు విశేషణాలు ఆవిష్కృతమయ్యాయి. ఏపీ అభివృద్ధికి ఏదో ఒకటి కీలక ప్రకటన చేస్తారని యావత్తు ఏపీ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తే... తనతో దోస్తానాను తెంచేసుకున్న టీడీపీ - ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా మోదీ ప్రసంగం సాగింది. ఏపీ ప్రజలు సంతోషించదగ్గ ఒక్కటంటే ఒక్క విషయాన్ని కూడా  మోదీ ప్రస్తావించకుండానే నిర్దయగానే వెళ్లిపోయారు. మొత్తంగా తన ప్రసంగం ద్వారా మోదీ తానెంత ఇగోఫెలోనో చెప్పకనే చెప్పేశారు. కేవలం తన ఇగోను శాటిస్ఫై చేసుకునేందుకే మోదీ... ఏపీ టూర్ ను వినియోగించుకున్నారని చెప్పక తప్పదు. ఇక ఈ టూర్‌లో అందరి నోటా నానుతున్న మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. అదే... మోదీ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం చేసిన బీజేపీ సీనియర్ నేత - ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నోట నుంచి వెలువడిన చచ్చు తెలుగీకరణ.జీవీఎల్ తెలుగు నేలకు అది కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తే అయినప్పటికీ... చాలా కాలం క్రితమే ఢిల్లీ వెళ్లిపోయి అక్కడే తిష్ట వేశారు. టీడీపీ - బీజేపీ కలిసి సాగినంత కాలం కూడా జీవీఎల్ తెర ముందుకు వచ్చే అవకాశం దక్కలేదు. అయితే ఎప్పుడైతే ఈ రెండు పార్టీలు వైరి వర్గాలు మారిపోయాయో... అప్పుడే విషయ పరిజ్ఞానం కాస్తంత ఎక్కువగానే ఉన్న జీవీఎల్ కమలనాథులకు గుర్తుకు వచ్చారు. అంతే.. ఏపీకి చెందిన తమ పార్టీ నేతతో ఏపీలోని తన వైరివర్గాన్ని టార్గెట్ చేయాలని సంకల్పించిన బీజేపీ అధిష్ఠానం... జీవీఎల్ కు పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఏకంగా రాజ్యసభ సీటును ఇచ్చేసింది. ఇంకేముంది... తనపై పార్టీ అధిష్ఠానం ఎంతో ఆశ పెట్టుకుందని భావించిన జీవీఎల్... తన మకాంను ఢిల్లీ నుంచి విజయవాడకు షిప్ట్ చేశారు. టీడీపీ నేతలు ప్రత్యేకించి చంద్రబాబుపై తనదైన శైలి విమర్శలు సంధిస్తూ వేడిని పెంచేశారు.

ఈ క్రమంలో నేటి మోదీ పర్యటనలో మోదీ ప్రసంగాన్ని అనువదించే భాగ్యాన్ని కూడా బీజేపీ నేతలు... జీవీఎల్ కే కట్టబెట్టారు. అయితే ఇందులో మాత్రం జీవీఎల్ ఘోరంగా విఫలమయ్యారని చెప్పాలి. మోదీ తనదైన శైలి వాగ్బాణాలతో చంద్రబాబు - లోకేశ్ లపై విరుచుకుపడితే... ఆ మాటలను అచ్చ తెలుగులో చెప్పేందుకు జీవీఎల్ నానా పాట్లు పడ్డారు. ఈ క్రమంలో మోదీ చెప్పింది ఒకటైతే... జీవీఎల్ చెప్పింది మరొకటిగా మారిపోయాయి. అంతేనా... మోదీ తనదైన స్వర గాంభీర్యంతో సెటైరిక్ ప్రసంగం చేస్తే.. దానిని చేవ చచ్చిన తెలుగీకరణతో జీవీఎల్ చంపేశారు. మొత్తంగా ఇకపై తెలుగు అనువాదం అంటేనే ఏవగింపు కలిగించే రీతిలో జీవీఎల్ వ్యవహరించారని చెప్పక తప్పదు. జీవీఎల్ తెలుగీకరణ విన్న తెలుగు ప్రజలు ఇంకెప్పుడూ ఈ బాధ్యతలు తీసుకోవద్దు మహాప్రభో అంటూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు సంధిస్తున్నారు.