దేశంపై మోదీ విసిరిన ఆయుధం

Fri Aug 10 2018 07:00:27 GMT+0530 (IST)

తెలుగుదేశం పార్టీ - భారతీయ జనతా పార్టీల మధ్య యుద్దం నానాటికి తీవ్రమవుతోంది. గడచిన ఐదారు నెలలుగా రెండు పార్టీల మధ్య "పచ్చ" గడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండుపార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఈ పోరులో కొన్నాళ్ల పాటు భారతీయ జనతా పార్టీ నాయకుడు - ఎమ్మెల్సీ సోము వీర్రాజును తెలుగుదేశం పార్టీపై ఆయుధంగా ప్రయోగించింది భారతీయ జనతా పార్టీ. ఆయనతో చంద్రబాబు నాయుడిపై - తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించేలా చేసింది. ఆ సమయంలో సోము వీర్రాజు కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం నాయకులు విలవిల్లాడారు. సోము వీర్రాజు రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం నాయకులపై - ప్రభుత్వం ఎక్కడికక్కడ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడే లక్ష్యంగా పోలవరం పనులు - ఇసుక దందాలు - రాష్ట్రంలో అవినీతి పెరిగిందంటూ సోము వీర్రాజు చేసిన ఆరోపణలు విమర్శలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓ వ్యూహన్నే రూపొందించిందని ప్రచారం జరిగింది. కొన్నాళ్ల వరకూ సోము వీర్రాజును అస్త్రంగా చేసుకున్న బిజెపి ఇప్పుడు తాజాగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును తెలుగుదేశంపై ప్రయోగించడం ప్రారంభించింది. రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అయినప్పటి వరకూ జీవీఎల్ నరసింహారావు ఎవరో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. బీజేపీ నుంచి  రాజ్యసభ సభ్యుడిగా జీవీఎల్  ఎంపిక అయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీపై ఆయన్ని ఆయుధంగా ప్రయోగిస్తోంది బీజేపీ. సోము వీర్రాజు స్థానంలో బీజేపీ ప్రయోగించిన కొత్త అస్త్రం ఈ జీవీఎల్.

పోలవరం పనులు - అందుకు కేంద్రం విడుదల చేసిన నిధులు - అంశాలపై తొలుత విమర్శన గళం ఎత్తిన జీవీఎల్ ప్రస్తుతం చంద్రబాబుపై నేరుగా తుపాకి ఎక్కుపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పీడీ అకౌంట్ల నుంచి తిరుమల వ్యవహారాలు శైతం జీవీఎల్ విరుచుకుపడుతున్నారు. విశాఖ రైల్వే జోన్ పై బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో  జరిగిన సమావేశంలో తెలుగుదేశం ఎంపీలు - ప్రజాప్రతినిధులపై అంతెత్తున జీవీఎల్ మండిపడ్డారు. ఒక దశలో పెద్ద వివాదమే జరిగే అవకాశమూ కనిపించింది. అయితే కేంద్ర మంత్రి ఇతర సభ్యులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలలో అధికార బీజేపీ కూటమి గెలుపొందడంతో జీవీఎల్ మరోసారి తెలుగుదేశంపై విరుకుపడ్డారు. కాంగ్రెస్ తో కలిసిన తెలుగుదేశం పార్టీకి తగిన శాస్తి జరిగిందన్నారు. ఇలా నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీపై ప్రభుత్వంపై ప్రయోగిస్తున్న జీవీఎల్ ఆయుధం ముందు ముందు మరింతా రాటు తేలుతుందేమోనని రాజకీయ వర్గాలలో  చర్చ జరుగుతోంది.