Begin typing your search above and press return to search.

ర‌మేష్ వీధిరౌడీలా మాట్లాడుతున్నారు:జీవీఎల్

By:  Tupaki Desk   |   19 Oct 2018 4:15 PM GMT
ర‌మేష్ వీధిరౌడీలా మాట్లాడుతున్నారు:జీవీఎల్
X
టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ - బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుల మ‌ధ్య మాటల యుద్ధం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. లైవ్ డిబేట్ సంద‌ర్భంగా జీవీఎల్ ను అస‌భ్య ప‌ద‌జాలంతో ర‌మేష్ దూషించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోసారి ర‌మేష్ పై జీవీఎల్ మండిప‌డ్డారు. తన సొంత కంపెనీల్లోనే తప్పుడు లెక్కలు చూపించిన ర‌మేష్ పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీలో దేశం లెక్క‌ల‌ను ఏవిధంగా చూపిస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రమేష్ లాంటి వ్యక్తి పీఏసీలో ఉండటం దారుణమని, రూ.100 కోట్ల రూపాయ‌లు దారి మళ్లించిన ర‌మేష్ ను పీఏసీ నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు...ర‌మేష్ ను వెంట‌నే తొల‌గించ‌క‌పోతే ర‌మేష్ పై పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఏపీలో ఐటీ పేరుతో లూటీ జరుగుతోందని - ఐటీ ఉద్యోగాల కల్పన పేరుతో...చంద్ర‌బాబు - లోకేష్ త‌మ‌ బినామీలకు ఐటీ కంపెనీలను కట్టబెడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసే వారి పేర్లను గోప్యంగా ఉంచుతున్న చంద్ర‌బాబు... తాము పారదర్శకత పాటిస్తున్నామని చెప్ప‌డం విడ్డూర‌మ‌న్నారు.

రమేష్ ను రాజ్యసభకు పంపినందుకు ఏపీ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలపై రమేష్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీసం మెలేసిన ర‌మేష్....ఆ కథనాలతో మీసం తీయించుకుంటారా అని సవాల్‌ విసిరారు. రమేష్ భాష పార్లమెంటు సంప్రదాయానికి విరుద్ధంగా ఉందన్నారు. వాస్తవాలను ర‌మేష్ జీర్ణించుకోలేకపోతున్నారని - అందుకే త‌న‌లాంటి వారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రమేష్‌ సారాయి కాంట్రాక్టర్‌ - వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 24 గంటల్లో ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూముల వివరాలను బయటపెట్టాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. మంత్రి లోకేష్ కు మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు ఏం అర్హత ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్ర‌శ్నించార‌ని - ఆ ప్రశ్నకు బాబు సమాధానం చెప్పాల‌న్నారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కానుందని జీవీఎల్ జోస్యం చెప్పారు.