Begin typing your search above and press return to search.

బాబు ద‌మ్ముంటే..ఐరాసా ఆహ్వానాన్ని బ‌య‌ట‌పెట్టు

By:  Tupaki Desk   |   22 Sep 2018 2:28 PM GMT
బాబు ద‌మ్ముంటే..ఐరాసా ఆహ్వానాన్ని బ‌య‌ట‌పెట్టు
X
ఏపీ సీఎం చంద్రబాబు నేడు అమెరికాకు బయలుదేరనున్నార‌నే వార్త మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌సారం అవుతున్న సంగ‌తి తెలిసిందే. న్యూయార్క్‌ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్ధిక వేదిక బ్లూంబెర్గ్ నిర్వహించే సుస్థిర అభివృద్ధి- ప్రభావం సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ నుంచి అమెరికాకు బయల్దేరి వెళ్తారు. 23వ తేది నుంచి 26వ తేది వరకు పర్యటించి తిరిగి 28న అమరావతి చేరుకుంటారని సీఎం అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ఈ ప్ర‌చారం సాగుతోంది. అయితే, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఈ ఎపిసోడ్‌ పై తీవ్రంగా స్పందించారు. న్యూయార్క్ లో సమావేశం జరిగినంత మాత్రాన ఐక్యరాజ్యసమితి నిర్వహించినట్లు కాదని పేర్కొన్నారు. అస‌లు చంద్ర‌బాబుకు ఆహ్వానమే రాలేద‌న్నారు.

విజ‌య‌వాడ‌లో జీవీఎల్ న‌ర‌సింహారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బూటకపు పాలన సాగుతోందని విమర్శించారు. వరల్డ్ ఎకనామిక్ ఫారం నిర్వహిస్తున్న సమావేశానికి చంద్రబాబు వెళుతున్నారని, కానీ దానికి మ‌రో రంగు పూస్తున్నార‌ని తెలిపారు. చంద్రబాబుకు ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన ఆహ్వానాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేస్తున్న విదేశీ పర్యటన కేవలం సొంత డప్పుకు ఉపయోగపడుతోందని ఆరోపించారు. చంద్రబాబు విమానం ఎక్కేలోపు అమెరికా టూర్‌పై స్పష్టతనివ్వాలన్నారు. ఎకనామిక్‌ ఫోరమ్‌ ఫోరమ్‌ వారు పెడుతున్న సమావేశానికి ఐరాసకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ స‌ర్కారుపై జీవీఎల్ విరుచుకుప‌డ్డారు. పోలవరం ప్రాజెక్ట్ లో దోపిడి జరిగిందని కాగ్ నివేదిక తెలిపిందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వమే పోలవరం కాంట్రాక్టు తీసుకున్నట్టు కనబడుతుందని ఆరోపించారు. ఆరు నెలలోనే టీడీపీ ప్రభుత్వాన్ని వదిలించుకోవడానికి ప్రజలు సిద్దపడ్డారని ఆరోపించారు. రామాయపట్నం పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోదావరి పుష్కరాలలో భక్తులు మృతి చెందారని జీవీఎల్ విమర్శించారు. రాఫెల్ డీల్ విష‌యంలో విమ‌ర్శ‌ల కంటే ఆధారాలు ఉంటే తప్పని సరిగా బయట పెట్టాలని తెలిపారు.