ప్రజాధనంతో ప్రయాణాలేంటి బాబూ?:జీవీఎల్

Fri Nov 09 2018 17:39:22 GMT+0530 (IST)

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మరోసారి మండిపడ్డారు. ఏపీలో పరిపాలనను చంద్రబాబు గాలికి వదిలేశారని పాల వ్యాపారంపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై చూపడం లేదని నిప్పులు చెరిగారు. ధర్మపోరాటం పేరిట దొంగ దీక్షలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన బాబు....ఢిల్లీకి వెళ్లి ప్రజాస్వామ్యంపై పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నియంతృత్వ ధోరణి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జీవీఎల్ హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో ఏపీ ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని వినాశకాలే విపరీత బుద్ధి అని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలోని అధికార పార్టీలో ఒక్కటీ మంచి లక్షణాలు లేవని టీడీపీ నేతలు పిరికిపందలని ధ్వజమెత్తారు.ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకున్న చంద్రబాబు...పూర్తి సమయం పార్టీ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారన్నారని మండిపడ్డారు. చంద్రబాబు విలాస విమాన ప్రయాణాలకు ప్రజల సొమ్ము దుర్వినియోగపరుస్తున్నారని ప్రజలు చంద్రబాబును చీదరించుకుంటున్నారని న్నారు. రాజకీయ కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రికి డబ్బులిచ్చిన అధికారులు కూడా ఆ డబ్బుకు జవాబు చెప్పాలని అన్నారు. అలాంటి అధికారులను కోర్టులకు ఈడుస్తామని వారిని వదిలి పెట్టబోమని అన్నారు. అధికార కార్యక్రమాలు ఉంటేనే ప్రజాధనం వినియోగించాలని ఈ అంశాలపై అవసరమైతే కోర్టుకు వెళ్తామని అన్నారు. అవినీతిపై చర్చకు సవాళ్లు చేసిన టీడీపీ నేతలు చర్చలకు రావాలని జీవీఎల్ సవాల్ విసిరారు.  సవాల్ చేయడం...తాను చర్చకు వచ్చాక పారిపోవడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. ఇటువంటి చచ్చు సవాళ్లు మానుకోవాలని ఇలాంటి పిరికిపందలు ఎలా పరిపాలన చేస్తారని ప్రశ్నించారు. తనలాంటి తక్కువ స్థాయి నేతలతో లోకేష్ చర్చకు రారని చెప్పారని అసలు లోకేష్ స్థాయి ఏమిటని ఎద్దేవా చేశారు.