జీఎస్టీ వాయింపు స్లాబుల లెక్క తేలింది

Fri May 19 2017 09:57:02 GMT+0530 (IST)

ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ బాదుడుకు సైతం నినాదాన్ని పెట్టి ప్రచారం చేసుకున్న ఘనత మోడీ సర్కారుకే దక్కుతుంది. దేశ వ్యాప్తంగా వివిధ రకాల సరుకులు.. సర్వీసులకు సంబంధించి అమలు చేయాలని భావిస్తున్న జీఎస్టీ పన్ను రేట్ల లెక్క ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. తాజాగా జరిగిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్వహించిన సమావేశం అనంతరం జీఎస్టీ కింద పన్ను బాదుడు ఎంత ఉండాలన్నది నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. జీఎస్టీ పరిధిలోని 80 నుంచి 90 శాతం సరుకులు.. సర్వీసులకు సంబంధించిన పన్నురేట్లను జీఎస్టీ మండలి ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.మొత్తం నాలుగు రకాల రేట్లలో జీఎస్టీ బాదుడు ఉండనుంది. అతి తక్కువ పన్నుపోటు 5 శాతంగా నిర్ణయించారు.

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ నిర్వహిస్తున్న రెండు రోజుల కీలక సమావేశాలు గురువారం శ్రీనగర్ లో స్టార్ట్ అయ్యాయి. ఈ మండలిలో సభ్యులుగా ఉన్న అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జీఎస్టీకి సంబంధించిన నిబంధనావళిని తొలిరోజు సమావేశంలో ఆమోదించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై ఒకటి నుంచి జీఎస్టీని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న మోడీ సర్కారు.. వివిధ సరుకులు.. సర్వీసుల మీద ఇప్పటికే ఉన్న పన్ను రేట్లు యథావిధిగా కంటిన్యూ అయ్యేలా స్లాబ్లుల్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

5... 12.. 18.. 28 శాతంగా శ్లాబులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపుగా ఖరారు చేసిన బాదుడు పన్ను రేట్లను చూసినప్పుడు జీఎస్టీ అమలు తర్వాత కూడా ఇప్పుడున్న పన్ను ధరలే కంటిన్యూ అవుతాయే తప్పించి తగ్గే అవకాశాలు లేవని స్పష్టమవుతుంది. తాజా సమావేశంలో సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ ఒకటి నడిచినట్లుగా తెలుస్తోంది. పట్టుదారం.. పూజాసామాగ్రి లాంటి వాటికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కొందరు సూచించగా.. అత్యవసరం అన్న అతి తక్కువ సరుకులు.. సర్వీసులకు మాత్రమే పన్ను మినహాయింపు ఉండేలా జైట్లీ అన్నట్లుగా తెలిసింది. బంగారం మీద ఒక శాతం పన్ను వేయాలని కొందరు కోరగా.. బంగారం అత్యవసరం కాదని.. 5 శాతం పన్ను బాదుడు ఉండాలని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ సూచన చేసినట్లుగా చెబుతున్నారు.

పూజాసామాగ్రి మీద పన్ను లేకుండా చేయాలని  యూపీ ఆర్థికమంత్రి కోరినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. పన్ను పరిధిలోకి 81 శాతం వస్తువుల మీద 18 శాతం అంతకంటే తక్కువే పన్ను భారం ఉండనున్నట్లుగా చెబుతున్నారు. వరి.. గోధుమ లాంటి ఆహారధాన్యాలు.. పాలు.. పెరుగు.. తృణధాన్యాలకు పన్ను మినహాయించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో వరి.. గోధుమలపై వ్యాట్ అమలు చేస్తున్నారు. తాజా జీఎస్టీ నేపథ్యంలో అలా పన్ను విధించే రాష్ట్రాల్లో వరి.. గోధుమపై పన్ను పోటు పోయి ధరలు మరింత తగ్గే వీలుంది.  ప్రాణ రక్షణ ఔషధాలు 5 శాతం పన్ను పరిధిలో ఉండనున్నాయి. ప్రస్తుతం 11.69 శాతం ఉన్న బొగ్గుకు జీఎస్టీలో 5 శాతం పన్ను రేటే ఉండనుంది. నిత్యం ప్రజలంతా వినియోగించే కొబ్బరినూనె.. సబ్బులు.. టూత్ పేస్టులు 18 శాతం పన్ను బ్రాకెట్లో చేర్చారు. ఇప్పటివరకూ వీటిపై 22 నుంచి 24 శాతం మేర పన్ను బాదుడు బాదుతున్నారు. మొత్తం 1211 రకాల వస్తువుల్లో కేవలం ఆరు వస్తువులు మినహా దాదాపు అన్ని వస్తువులకు సంబంధించిన పన్నురేట్లు ఖరారు చేశారు.

శీతల పానీయాలు.. కార్లు.. ఏసీలు.. ఫ్రిజ్ లు 28 శాతం పన్ను బ్రాకెట్లో ఉండనున్నట్లుగా చెబుతున్నారు. చిన్నకార్లపై 28 శాతం పన్నుతో పాటు ఒక శాతం సెస్ కూడా ఉండనుంది. మధ్యతరహా కార్లపై 3 శాతం.. లగ్జరీ కార్లపై 15 శాతం సెస్ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. పలు సేవలపై పన్నురేట్లను శుక్రవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/