Begin typing your search above and press return to search.

88 వ‌స్తువుల‌పై జీఎస్టీ త‌గ్గింపు..లాభం ఎవ‌రికంటే?

By:  Tupaki Desk   |   22 July 2018 4:47 AM GMT
88 వ‌స్తువుల‌పై జీఎస్టీ త‌గ్గింపు..లాభం ఎవ‌రికంటే?
X
కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒక దేశం.. ఒక ప‌న్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ బాదుడుపై కాస్తంత ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు. 88 వ‌స్తువుల‌పై ఇప్పుడున్న ప‌న్ను శ్లాబుల్ని స‌వ‌రిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ స‌వ‌రించిన ప‌న్నుల విధానం ఈ నెల 27 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. తాజా ప‌న్ను రాయితీ కార‌ణంగా కేంద్రానికి రూ.8వేల నుంచి రూ.10వేల కోట్ల వ‌ర‌కు ఆదాయానికి గండి ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

జీఎస్టీ జాబితాలో ఉన్న ప‌లు వ‌స్తువ‌ల‌పై విధించిన ప‌న్ను రేట్ల‌ను త‌గ్గించాల‌ని వివిధ రాష్ట్రాలు కోరాయి. దీనికి త‌గ్గ‌ట్లే జీఎస్టీ కౌన్సిల్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది. ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా అత్య‌ధిక ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగేలా నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

తాజా త‌గ్గింపు కార‌ణంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌తో పాటు ఆర్థిక‌ప్ర‌గ‌తిని కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ప‌న్ను త‌గ్గింపు విష‌యానికి శానిట‌రీ న్యాప్ కిన్స్ పైపూర్తిగా ప‌న్ను ఎత్తేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ వీటిపై 12 శాతం ప‌న్ను విధించేవారు. అదే విధంగా రాఖీల‌పైనా ప‌న్నును పూర్తిగా మిన‌హాయించారు. చిన్న త‌ర‌హా హ‌స్త క‌ళ‌ల‌పైనా ప‌న్ను తీసేశారు.

తాజా త‌గ్గింపును చూస్తే.. ఎక్కువ‌గా 28 శాతం ప‌న్ను రేటులో ఉన్న వ‌స్తువుల్ని 18 శాతానికి త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇలాంటి వాటిల్లో టీవీలు.. ఫ్రిజ్ లు.. వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. పెయింట్లు.. వార్నిష్.. పుట్టీల‌పైనా ప‌న్నును త‌గ్గించారు. దీంతో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఎక్కువ ఊర‌ట‌నిచ్చేలా ఉండ‌నుంది. ఈ-పుస్త‌కాల‌పై ప‌న్నును 18 నుంచి 5 శాతానికి త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా తీసుకున్న కీల‌క‌మైన నిర్ణ‌యాల‌కు వ‌స్తే.. మూడు నెల‌ల‌కు ఒక‌సారి రిట్న‌ర్ లు స‌మ‌ర్పించాల‌న్న నిబంధ‌న రూ.1.5 కోట్ల వార్షిక‌ ట‌ర్నోవ‌ర్ చేసే వారు ఉండేవారు. దీనికి రూ.5 కోట్ల‌కు పెంచారు. దీంతో.. ఓ మోస్తరు వ్యాపారం చేసే వారు త‌ర‌చూ చేయాల్సిన ఈ ఫైలింగ్ తిప్ప‌లు త‌ప్ప‌నున్నాయి. రిట‌ర్న్స్ దాఖ‌లును మ‌రింత స‌ర‌ళీకృతం చేయ‌టం ద్వారా ప‌న్ను వ‌సూళ్లు మ‌రింత పెరిగే వీలుంద‌ని చెబుతున్నారు.

ప‌న్ను నుంచి పూర్తిగా మిన‌హాయించిన వ‌స్తువులు

+ శానిటరీ న్యాప్‌కిన్స్‌
+ రాఖీలు
+ చలువ రాయి/ రాయి/చెక్క విగ్రహాలు
+ పోష‌కాలు కలిపిన పాలు
+ కొండ చీపుర్లు
+ విస్తరాకులు

5 శాతం ప‌న్ను జాబితాలోకి కొత్త‌గా తెచ్చిన‌వి

= చమురు కంపెనీలు ఉపయోగించే ఇథనాల్‌
= సాధారణ పాదరక్షలు

12 శాతం జాబితాలోకి తెచ్చిన వ‌స్తువులు

- హస్త కళల వస్తువులు
- హ్యాండ్‌ బ్యాగ్‌లు,
- వెదురు ఫ్లోరింగ్‌
- నగల పెట్టె
- చిత్రాల కోసం ఉపయోగించే చెక్క పెట్టె
- గాజుతో చేసిన కళాకృతులు,
- రాతి వస్తువులు,
- కళాకృత అద్దాలు
- చేతితో చేసిన దీపాలు

18 శాతం జాబితాలోకి తెచ్చిన వ‌స్తువులు

% వాషింగ్‌ మిషన్లు
% ఫ్రిజ్ లు
% టీవీలు (27 అంగుళాలు),
% వీడియో గేమ్స్
% వ్యాక్యూం క్లీనర్లు
% పళ్లరసాల మిక్సర్లు
% గ్రైండర్లు
% షేవర్లు
% హెయిర్‌ డ్రయర్లు
% వాటర్‌ కూలర్లు
% వాటర్‌ హీటర్లు
% విద్యుత్తు ఇస్త్రీ పెట్టెలు
% సెంట్లు
% కాస్మోటిక్స్
% టాయిలెట్‌ స్ప్రే
% పెయింట్లు
%గోడ పుట్టీ
% వార్నిష్‌
% వర్క్‌ ట్రక్‌

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. హోట‌ళ్ల‌కు ఊర‌ట క‌లిగించేలా జీఎస్టీ మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన అద్దెల ఆధారంగా కాకుండా వాస్త‌వంగా జ‌రిగే వ్యాపారం ఆధారంగా ప‌న్ను వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం హోట‌ల్ రూమ్ రెంట్ రూ.7500 మించితే 28 శాతం ప‌న్ను శ్లాబులోకి వెళ‌తారు. అదే రూ.7500 నుంచి రూ.2500 మ‌ధ్య ఉంటే 18శాతం ప‌న్ను.. రూ.2500 నుంచి రూ.1000 మ‌ధ్య అయితే 12 శాతం ప‌న్ను వ‌సూలు చేసే వారు. దీని స్థానే ఇక‌పై అద్దె ఎంత వ‌సూలు అయ్యింద‌న్న ఆధారంగా ప‌న్ను విధించ‌నున్నారు. ఈ విధానం అమ‌లైతే.. ప‌న్నుపోటు మ‌రింత త‌గ్గే వీలుందంటున్నారు.