అమలాపురంలో మారిన టీడీపీ చాయిస్

Mon Feb 18 2019 16:16:39 GMT+0530 (IST)

ఎంపీ రవీంద్రబాబు గుర్తున్నాడా... మందు - మాంసం కోసమే చాలా మంది సైన్యంలో చేరతారని కామెంట్లు చేశారే ఆయన. ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరి కారణమేంటో గాని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఆయన వ్యవహారం నచ్చలేనట్లుంది. సర్వేల ఆధారంగా అతని పర్ఫామెన్స్ బాగా లేదని చంద్రబాబు అంచనా వేయడం ఒక కారణమైతే... ఆ నియోజకవర్గానికి ఈసారి ఒక మంచి అభ్యర్థి దొరకడం కూడా రవీంద్రబాబుకు టిక్కెట్ రాకపోవడానికి కారణం. ఎంపీ టిక్కెట్ లేకుంటే ఏం ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వొచ్చుగా అంటారా... అప్పటికే ఎమ్మెల్యే బరిలో వేరే లిస్టు ఉంది. అందుకే రవీంద్రబాబు కూడా బాబు ఒకటి తలిస్తే తానొకటి తలచి వైసీపీ వైపు చూశారు. త్వరలో వైసీపీలో చేరుతున్నారు.మరి ఇంతకీ అమలాపురం లోక్ సభకు బాబుకు దొరికిన ఆప్షన్ ఎవరో తెలుసా... భారతదేశపు తొలి దళిత స్పీకర్ బాలయోగి కుమారుడు. కోనసీమలో రోడ్లు - రైలు మార్గాల అభివృద్ధి తనదైన ముద్ర వేశారు బాలయోగి. కోనసీమ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా నిలిచిన యానాం-ఎదుర్లంక వారధి బాలయోగి పట్టుబట్టి దగ్గరుండి నిర్మించిన ప్రాజెక్టు. ఇపుడు దానికి ఆయన పేరు పెట్టారు. అభివృద్ధి పనుల్లో అతను చూపిన వేగం నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చేలా చేసింది. అందుకే బాలయోగిపై ఉన్న పాజిటివిటీని నమ్ముకుని టీడీపీ ఆయన కుమారుడు హరీష్ మాథుర్ ని ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తోంది. గతంలో అతని వయసు సరిపోకపోవడంతో రాజకీయ పదవులకు పోటీ పడలేదు. అందుకే 30 ఏళ్ల ఈ యువకుడిని ఎంచుకుంది. ఇప్పటికే హరీష్ పనులు మొదలుపెట్టడంతో ఇక తనకు సీటు రాదని ఫిక్సయిన రవీంద్రబాబు పార్టీని వదిలేయాలని నిర్ణయించాడు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... ఇలా సీటు దక్కని వాళ్లకు - నెగెటివిటీ ఉన్న వాళ్లకు జగన్ ఆదరణ దక్కడం వైసీపీ శ్రేణులకు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇపుడిపుడే జగన్ వేవ్ బలపడుతున్న సమయంలో ఇలాంటి వారిని చేర్చుకోవడం పార్టీని ఇబ్బందుల్లో పడేస్తుందన్నది వైసీపీకి అంత శ్రేష్టం కాదంటున్నారు. ఒకవేళ అలాంటి వారిని పార్టీలో తీసుకోవడంలో తప్పులేదు గాని టిక్కెట్లు ఇస్తే మాత్రం కచ్చితంగా నష్టమే అన్నది టాక్. ఈ వ్యూహాత్మక పొరపాట్లపై పార్టీ జాగ్రత్త పడకపోతే ఇలాంటి కొత్త చేరికలతో రాష్ట్రంలో హడావుడి కనిపించినా నియోజకవర్గ స్థాయిలో నష్టం వాటిల్లడం ఖాయం అంటున్నారు.