Begin typing your search above and press return to search.

కార్పొరేటర్ పెళ్లికి వెళ్తాం పదండి

By:  Tupaki Desk   |   14 Feb 2016 11:30 AM GMT
కార్పొరేటర్ పెళ్లికి వెళ్తాం పదండి
X
గ్రేటర్ హైదరాబాద్ పాలనలో యువరక్తం ఉరకలేస్తోంది. బల్దియా కౌన్సిల్‌కు ఎన్నికైన 150 కార్పొరేటర్లలో అత్యధికుల సగటు వయస్సు 35 మాత్రమే కావటం గమనార్హం. గతంలో ఎన్నడూ ఈ స్ధాయిలో యువత బల్దియా పాలకవర్గానికి ఎన్నిక కాలేదు. ఇపుడు ఎన్నికైన వారిలో పలువురు కార్పొరేటర్లకు ఇంకా పెళ్లి కూడా కాలేదు.

కాంగ్రెస్ - టిడిపి - భాజపాల తరపున గెలిచిన ఆరు మందికి తోడు ఎంఐఎం తరపున గెలిచిన వారిలో కూడా పలువురు పిన్న వయస్కులే ఉండటం విశేషం. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న వీరంతా ఆయా డివిజన్లలోని సమస్యలను ఆకళింపు చేసుకోవటంతోపాటు పరిష్కారాల మార్గాలపై కూడా అవగాహన ఉన్నవారే. దానికి తోడు గెలిచిన వారిలో అత్యధికులు విద్యాధికులు - ఐటి లాంటి సాంకేతిక విద్యతో బాగా పరిచయం ఉన్న వారే కావటం నగరానికి కలిసివస్తుందని భావిస్తున్నారు.

గ్రేటర్ మేయర్‌ గా బాధ్యతలు తీసుకున్న బొంతు రామ్మోహన్ - డిప్యూటి మేయర్ ఫసీయుద్దీన్ ఇద్దరు 35 ఏళ్ళ వయస్సులోపే ఉన్నారు. ఆ వయస్సు వారిలో సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉండటం సహజం. సుభాష్‌ నగర్ నుండి శాంతిశ్రీ ... ఉప్పుగూడ నుండి ఫహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దత్.. గోషామహల్ కార్పొరేటర్ గా ముఖేష్ సింగ్.. మంగళ్‌ హాట్ కార్పొరేటర్ గా పరమేశ్వరి సింగ్.. ఇలా చాలామంది గట్టిగా 30 ఏళ్ల వయసువారే. ఈసారి గెలిచినవారిలో మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అదేవిధంగా పెళ్లి కాని కార్పొరేటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీంతో ఈ విజయం అనంతరం వారిలో చాలామంది పెళ్లిళ్లు చేసుకునే సూచనలున్నాయి. దాంతో గ్రేటర్ ప్రజలు తమ కార్పొరేటర్ల పెళ్లికి వెళ్లడానికి రెడీ కావాల్సిందే.