ఫుల్ షర్ట్ వేసుకుంటే...పరీక్షకు నో ఎంట్రీ

Fri May 19 2017 10:15:45 GMT+0530 (IST)

కొద్దికాలం క్రితం కలకలం సృష్టించిన నీట్ పరీక్ష ఉదంతం గుర్తుండే ఉంటుంది. నీట్ పరీక్ష హాజరయ్యేందుకు వస్త్రాధారణ విషయంలో విధించిన ఇబ్బందికరమైన నిబంధన దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. అయితే నీట్ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకూ ఐఐటీ కౌన్సిల్ పలు ఆదేశాలు జారీ చేసింది.  అందులోనూ వస్త్ర ధారణ విషయంలో కచ్చితమైన ఒకింత కఠినమై నిబంధనలు విధించింది. అవేంటయ్య అంటే...అబ్బాయిలు కుర్తా - పైజామా - ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ధరించి పరీక్షకు హాజరు కావద్దు. లైట్ కలర్ జీన్స్ - ప్యాంట్లు - హాఫ్ హ్యాండ్స్ షర్ట్ లు - స్లిప్పర్ల తరహా చెప్పులను మాత్రమే అనుమతిస్తారు! అమ్మాయిలు పూసలు - పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా రంగురంగుల వస్త్రాలు - హైహీల్స్ - పెద్ద బటన్స్ ఉన్న వస్త్రాలతో వస్తే పరీక్షకు అనుమతించబోమని ఐఐటీ కౌన్సిల్ తేల్చి చెప్పింది.

ఈ నెల 21న దేశవ్యాప్తంగా జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రానికి విద్యార్థులను గంట ముందే చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరని స్పష్టం చేసింది. పరీక్షకు అవసరమైన పెన్నులు - పెన్సిళ్లను మాత్రమే అనుమతిస్తారని వివరించింది. హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకునిరావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. చేతి గడియారాలు - సెల్ ఫోన్ లు - పెన్ డ్రైవ్ - ఇయర్ ఫోన్స్ -  కాలుక్యులేటర్లు - ఐపాడ్ - హెల్త్ బ్యాండ్ లతో పాటు బ్లూటూత్ తో అనుసంధానించే డివైజ్ లను అనుమతించరు. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో భాగంగా పేపర్-1ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 31 వేల మంది విద్యార్ధులు పరీక్షకు హాజరవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/