Begin typing your search above and press return to search.

ట్రంప్ లాగే గెల‌వాల‌ని చూస్తున్న మ‌రో నేత

By:  Tupaki Desk   |   22 March 2017 4:53 AM GMT
ట్రంప్ లాగే గెల‌వాల‌ని చూస్తున్న మ‌రో నేత
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న విధానాల‌తో వివాదాస్ప‌దం అయిన‌ట్లే వాటి ఆధారంగానే ప‌లువురికి ఆద‌ర్శం అవుతున్నారు! శ‌రణార్థులు - ముస్లింల‌ పట్ల వ్యతిరేకతను ప్రకటించి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైతే డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారో...అవే పద్ధతుల్ని పాటించి ఫ్రాన్స్‌ అధ్యక్ష పదవిని పొందాలని ఆ దేశానికి చెందిన నేషనల్‌ ఫ్రంట్ నేత మెరైన్‌ లీ పెన్ తపిస్తున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్ష పదవికి ఏప్రిల్‌ 26న మొదటి రౌండ్‌ ఎన్నికలు జరుగుతాయి. వివిధ పార్టీల తరఫున మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఫ్రాంకోయిస్‌ ఫిల్లన్‌ (రిపబ్లికన్స్‌ పార్టీ) - మెరైన్‌ లీ పెన్‌ (నేషనల్‌ ఫ్రంట్‌-జాతీయ అతివాదం) ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌ (ఇండిపెండెట్‌) - బెనోయిట్‌ హామోన్‌ (అధికార సోషలిస్టు పార్టీ) - జీన్‌ లుక్‌ మెలెంచోన్‌ (లెఫ్ట్‌ పార్టీ-వామపక్ష పార్టీల మద్దతు ఉంది) ప్రచారంలో ముందంజలో ఉన్నారు. వీరినే టాప్‌-5 అభ్యర్థులుగా ఫ్రాన్స్‌ పత్రికలు పలు కథనాల్ని వెలువరిస్తున్నాయి.

ఫ్రాన్స్‌ కూడా బ్రిటన్‌ బాటలో నడవాలని గట్టిగా వినిపిస్తున్న నాయకురాలు లీ పెన్‌ (నేషనల్‌ ఫ్రంట్‌-జాతీయ అతివాదం). ఈయూ నుంచి ఫ్రాన్స్‌ బయటకు రావాల్సిందేనని, ఇందుకోసం రెఫరెండం నిర్వహించాల్సిందేనని గళమెత్తారు. అలాగే శరణార్థులకు ఆశ్రయమివ్వటం, ఇస్లాంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాడికల్‌ ఇస్లాం పెరిగిపోయిందంటూ ప్రజల్లో భయాన్ని నింపుతున్నారు. బురఖా - హిజాబ్‌ ధరించటాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. లీ పెన్‌ వాదనను మొద‌టి ముఖాముఖి చర్చలో మాక్రోన్‌ - మెలెంచోన్‌ (లెఫ్ట్‌ ఫ్రంట్‌) తప్పుబట్టారు. లీ పెన్‌ తన వాదనతో ఫ్రాన్స్‌ లౌకిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని, అబద్ధాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమని, ఇస్లామోఫోబియాతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నమని మాక్రోన్‌ - మెలెంచోన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాంకోయిస్‌ ఫిల్లన్‌ మాట్లాడుతూ....దేశాన్ని ముందుగా ఆర్థిక, సామాజిక సంక్షోభం నుంచి బయటకు తీసుకురావాలన్నారు. బ్రెగ్జిట్‌ ను వ్యతిరేకించారు.

మ‌రోవైపు లెఫ్ట్‌ పార్టీ నాయకుడు జీన్‌ లుక్‌ మెలెంచోన్‌ మిగతా పార్టీల అభ్యర్థులకు భిన్నమైన వాదనను వినిపించారు. సామాజిక సంక్షేమం - కార్మికుల హక్కులు - మానవాభివృద్ధి ప్రధానంగా చేసుకొని మెలెంచోన్‌ ప్రచారం చేస్తున్నారు. అయితే మిగతా పార్టీల అభ్యర్థులు వినిపిస్తున్న జాతీయ- అతివాద జాతీయ నినాదాలు ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి డిబేట్‌లో చర్చ అంతా వీటి చుట్టే నడిచింది. మొత్తంగా అతివాద జాతీయ ధోరణలు ఫ్రాన్స్‌కు కూడా పాకాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/